రప్ప రప్ప.. లొల్లి లొల్లి.. బేగంపేట వద్ద వైసీపీ కార్యకర్తల రచ్చ

రప్ప రప్ప.. లొల్లి లొల్లి.. బేగంపేట వద్ద  వైసీపీ కార్యకర్తల రచ్చ
  • పోలీసులను తోసేసి ఎయిర్​పోర్ట్​ లోపలకు.. 
  • నాంపల్లి కోర్టు దగ్గర కూడా  నినాదాలు

నాంపల్లి, వెలుగు: వైసీపీ అధినేత జగన్ నాంపల్లి కోర్టుకు హాజరైన సందర్భంగా ఆ పార్టీ అభిమానులు, కార్యకర్తలు రచ్చ రచ్చ చేశారు. బేగంపేట ఎయిర్​పోర్టు నుంచి.. నాంపల్లి కోర్టు వరకు ‘జగన్ సీఎం.. 2029లో రప్పా.. రప్పా.. జగన్​2.0 లోడింగ్..’​ అంటూ రోడ్లపై న్యూసెన్స్ చేశారు. జగన్.. బేగంపేట ఎయిర్​పోర్టుకు చేరుకోగానే.. నినాదాలు చేస్తూ లోపలికి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు ఆపేందుకు ప్రయత్నించినా.. తప్పించుకుని లోపలికి పరిగెత్తారు. నాంపల్లి కోర్టుకు వెళ్లగా.. అక్కడా ఇదే సీన్ కనిపించింది.

 మొదటి గేటు నుంచి కోర్టులోకి ప్రవేశించిన జగన్‌‌‌‌ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. కొందరు అభిమానులు ఆయన కాన్వాయ్ పైకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. నాంపల్లి కోర్టు ఏరియాతో పాటు రెడ్​హిల్స్, లక్డీకాపూల్, మాసాబ్​ట్యాంక్ ​ప్రాంతాల్లో వందల మంది..‘88 మ్యాజిక్ ఫిగర్ దాటాక గంగమ్మ జాతర, ‘2029లో రప్ప రప్ప, సీఎం సీఎం’ ​అంటూ పోస్టర్లు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు.

 దీంతో నాంపల్లి పరిసర ప్రాంతాల్లో అర కిలో మీటరు మేర ట్రాఫిక్‌‌‌‌కు అంతరాయం ఏర్పడింది. సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, అడిషనల్ డీసీపీ ఆనంద్, టాస్క్‌‌‌‌ఫోర్స్ ఏసీపీ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. విచారణ తర్వాత జగన్ మొదటి గేటు ద్వారా బయటకు రావాల్సి ఉన్నప్పటికీ, అభిమానులు అధికంగా ఉండడంతో రెండో గేటు ద్వారా పంపించారు. కోర్టు దగ్గర కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయగా మరింత ముందుకు దూసుకొచ్చారు. కాగా, జులై 8న వైఎస్ రాజశేఖర్​రెడ్డి జయంతి సందర్భంలోనూ హైదరాబాద్ సిటీ సెంటర్​ వద్ద  అర్ధరాత్రి వైసీపీ ఫ్యాన్స్ రచ్చ చేశారు.

సీబీఐ స్పెషల్ కోర్టుకు జగన్

అక్రమాస్తుల కేసులో ఏపీ మాజీ సీఎం వైఎస్‌‌‌‌ జగన్‌‌‌‌ గురువారం సీబీఐ స్పెషల్‌‌‌‌ కోర్టుకు హాజరయ్యారు. బేగంపేట ఎయిర్‌‌‌‌ పోర్టు నుంచి నాంపల్లి కోర్టుకు వచ్చారు.‌‌‌‌ కోర్టు అనుమతితో ఇటీవల యూరప్‌‌‌‌ వెళ్లిన జగన్‌‌‌‌.. పర్యటన అనంతరం నవంబర్‌‌‌‌‌‌‌‌ 21లోగా వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఆయన కోర్టుకు వచ్చారు. అనంతరం జడ్జి సూచన మేరకు అటెండెన్స్ రిజిస్టర్​లో సంతకం చేశారు. ఆ తర్వాత కోర్టు నుంచి వెళ్లిపోయారు.