
అమరావతి: రాష్ట్రంలో తెలుగుదేశం పార్డీ కిరాయి మనుషులతో వైసీపీ శ్రేణులపై దాడులకు తెగబడుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కి ఫిర్యాదు చేశారు. ఇటీవలి ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలే గ్రామాల్లో, పట్టణాల్లో తమ పార్టీ శ్రేణులపై టిడిపి వారు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని, ఆ దాడులను వ్యూహాత్మకంగా వైసిపి పై నెట్టె ప్రయత్నం చేస్తున్నారని డీజీపీకి తెలిపారు.
సోషల్ మీడియాలోనూ సిఎం, హోంమంత్రులపై అత్యంత దారుణంగా దుష్ప్రచారం చేస్తున్నారని, అసభ్యకరమైన పోస్డ్ లు పెడుతున్నారని రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లు ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా తమపై అక్కసుతో వ్యవహరిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ది పొందేందుకు టీడీపీ ఇటువంటి అరాచకాలకు పాల్పడుతోందని, వీటిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశారు.