వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్

వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అరెస్ట్

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన‌ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్ర‌వారం హైదరాబాద్ లోని రఘురామ ఇంటికి వెళ్లిన సీఐడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. 124 ఐపీసీ-ఏ సెక్షన్ కింద రఘురామరాజుపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారన్న ఆరోపణలతో ఆయనను అరెస్ట్ చేశారు. అయితే మొదట్లో వారిని సీఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకున్నారు. తమ ఉన్నతాధికారుల అనుమతి ఉంటేనే అదుపులోకి తీసుకునేందుకు ఒప్పుకుంటామని సీఆర్పీఎఫ్ పోలీసులు తేల్చి చెప్పారు. 

ఇదిలా ఉంటే అకారణంగా మా నాన్నని అరెస్ట్ చేశారని తెలిపాడు రఘురాం కృష్ణంరాజు కొడుకు భరత్. మధ్యాహ్నం 3.30కి 30 మంది పోలీసులు వారెంట్ లేకుండా వచ్చి బలవంతంగా లాక్కుని వెళ్లిపోయారని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. 4 నెలల క్రితం నాన్నకు బైపాస్ స‌ర్జ‌రీ జరిగిందని..ఓ ఎంపీని 30 మంది పోలీసులు సీఆర్పీఎఫ్ సిబ్బందిని నెట్టేసి తీసుకుపోయారన్నారు. నాన్నని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియ‌దని..మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, పోలీసుల దగ్గర వారెంట్ లేదన్నాడు. ఇవాళ నాన్న( ర‌ఘురామ కృష్ణంరాజు) పుట్టిన‌రోజ‌ని.. కావాల‌నే టార్గెట్ చేశార‌ని తెలిపాడు భ‌ర‌త్.


మ‌రోవైపు ర‌ఘురామ‌కృష్ణ రాజును డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెక్షన్‌ 24 కింద‌ అరెస్ట్‌ చేసిన‌ట్లు తెలిపింది ఏపీ సీఐడీ. సెక్షన్‌ 50 కింద అరెస్ట్ చేస్తున్నట్లుగా కుటుంబసభ్యులకు నోటీసులు అందజేసిన‌ట్లు తెలిపిన సీఐడీ.. 124(A), 153(B), 505 IPC, 120(B) సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అనంతరం ఆయన్ని మంగళగిరి సీఐడీ కార్యాలయానికి తరలించింది.