
దేశ సంపదను మోడీ సర్కారు కార్పొరేట్లకు దోచిపెడుతోందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారం ఏచూరి ఆరోపించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం నిర్వహించిన పార్టీ రాష్ట్ర ప్లీనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రైవేటీకరణను ప్రోత్సహించేలా ఉందన్నారు. కార్మిక చట్టాలను కాలరాస్తున్న బీజేపీ సర్కారు కొత్త విద్యావిధానం పేరుతో మత వైషమ్యాలకు తెరలేపుతోందన్నారు. ఎన్‌డీఏ హయాంలో ఆర్థిక దోపిడీ తీవ్రతరమైందన్నారు. సామాజిక దౌర్జన్యం పెరిగిందన్నారు. పుల్వామ ఘటన, బాలాకోట్ దాడులను ప్రచారం చేసుకొని దురభిమానాన్ని రెచ్చగొట్టి ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని తెలిపారు. ప్రజల పక్షాన వామపక్షాలు నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఎం గెలువకుండా మోడీ ఎన్నికల్లో రూ. కోట్లు కుమ్మరించారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు, వివిధ జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు.