ఒవైసీ చెప్తేనే అజారుద్దీన్కు మంత్రి పదవి.. రాజకీయాల్లోనూ వాళ్లది మ్యాచ్ ఫిక్సింగ్: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

ఒవైసీ చెప్తేనే అజారుద్దీన్కు మంత్రి పదవి.. రాజకీయాల్లోనూ వాళ్లది మ్యాచ్ ఫిక్సింగ్: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: క్రికెట్ లోనే కాదు రాజ‌‌కీయాల్లోనూ అజారుద్దీన్ మ్యాచ్ ఫిక్సంగ్ కు పాల్పడ్డారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఎంఐఎంతో మ్యాచ్ ఫిక్సింగ్ తో ఒవైసీ ఆశీస్సుల‌‌తోనే అజారుద్దీన్ కు మంత్రి ప‌‌ద‌‌వి వచ్చిందని విమర్శించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో మైనారిటీలు గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు.

 మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో అజారుద్దీన్ పై క్రికెట్ లో లైఫ్ టైమ్ బ్యాన్ ఉందని, అలాంటి వ్యక్తికి గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీ ఇస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల స్టంట్ అని మండిపడ్డారు. రోమ్ నగరం తగలబడుతుంటే రాజు ఫిడేల్ వాయించినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉందని విమర్శించారు. మొంథా తుఫాన్ రాష్ట్రాన్ని ముంచితే.. సీఎం పెండ్లిళ్లు, పేరంటాలు, సల్మాన్ ఖాన్ అంటూ తిరుగుతున్నారని ఏలేటి ఎద్దేవాచేశారు. 

రైతుల గోసను పట్టించుకోవాలన్న ధ్యాస రేవంత్ కు లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు. రెండేండ్ల పాలనలో ఎంతమంది రైతులను ఆదుకున్నారో సీఎం  శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే వరి పంటకు ఎకరానికి రూ.30 వేల నష్టపరిహారం ప్రకటించాలని ఏలేటి డిమాండే చేశారు.