ఎల్లంపల్లి గేట్లు మళ్లీ ఖుల్లా

ఎల్లంపల్లి గేట్లు మళ్లీ ఖుల్లా
  • పది గేట్లెత్తి నీళ్లు వదిలిన అధికారులు
  • మేడిగడ్డ నుంచి దిగువకు లక్షల క్యూసెక్కుల ప్రవాహం
  • కాళేశ్వరం నుంచి మిడ్‌‌ మానేరుకు ఎత్తిపోతల్లేవ్..
  • మిడ్​మానేరు కెపాసిటీ 25.87 టీఎంసీలు.. ఉన్న నీళ్లు 4.18 టీఎంసీలే
  • ఎల్ఎండీ మూడో వంతు ఖాళీ

కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన ఎల్లంపల్లి రిజర్వాయర్​ మళ్లీ పూర్తిగా నిండింది. పది గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఆ నీళ్లు సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను దాటి సముద్రం వైపు వెళ్లిపోతున్నాయి. ప్రాణహిత నదిలో భారీ ప్రవాహాలు వస్తుండటంతో.. మేడిగడ్డ వద్ద ఏకంగా 1.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. 16 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే కిందికి విడిచిపెడుతున్నారు. మరోవైపు మిడ్‌  మానేరు డ్యాం దాదాపు ఖాళీగా ఉంది. ఇక్కడ 25.87 టీఎంసీల కెపాసిటీకిగాను 4.18 టీఎంసీలే ఉన్నాయి. అటు కృష్ణా నది కూడా పోటెత్తుతోంది.

హైదరాబాద్‌‌, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన ఎల్లంపల్లి రిజర్వాయర్​ మళ్లీ పూర్తిగా నిండింది. అధికారులు మంగళవారం పది గేట్లను ఎత్తివేశారు. దాంతో 11,192 క్యూసెక్కుల నీళ్లు నదిలో దిగువకు వెళ్లిపోతున్నాయి. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 485.56 అడుగుల (20.18 టీఎంసీల)కుగాను.. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 485.14 అడుగుల (19.81 టీఎంసీల మేర) నీళ్లున్నాయి. ప్రాజెక్టులోకి 15,444 క్యూసెక్కుల వరద వస్తోంది.

కడెం నుంచి ప్రవాహం

ఉమ్మడి ఆదిలాబాద్  జిల్లా పరిధిలో కురుస్తున్న వానలతో కడెం ప్రాజెక్టులోకి 3,584 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తోంది. ఇంకా వర్షాలు కొనసాగే పరిస్థితి ఉండటంతో రెండు గేట్లను ఎత్తి 6,164 క్యూసెక్కులను వదులుతున్నారు. ఆ నీళ్లన్నీ ఎల్లంపల్లికి చేరుతున్నాయి. ఎల్లంపల్లి కూడా ఫుల్​గా ఉండటంతో వరదను దిగువకు వదిలేస్తున్నారు. ఆ నీళ్లు సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలను దాటి సముద్రం వైపు వెళ్లిపోతున్నాయి. ప్రాణహిత నదిలో భారీ ప్రవాహాలు వస్తుండటంతో.. మేడిగడ్డ వద్ద ఏకంగా 1.50 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో నమోదవుతోంది. 16 గేట్లను ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే కిందికి విడిచిపెడుతున్నారు. మేడిగడ్డ బ్యారేజీ స్టోరేజీ కెపాసిటీ16.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.17 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. అన్నారం బ్యారేజీకి 3,200 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తోంది. ఆ బ్యారేజీ  కెపాసిటీ 10.87 టీఎంసీలకు 9 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఎల్లంపల్లి నుంచి ఈ బ్యారేజీకి ప్రవాహం మొదలు కాగానే గేట్లు ఎత్తి నీటిని నదిలోకి విడుదల చేస్తామని అధికారులు చెప్తున్నారు.

ఎస్సారెస్పీకి వరద

గోదావరి బేసిన్‌‌లో ప్రధాన ప్రాజెక్టు ఎస్సారెస్పీకి వరద నిలకడగా కొనసాగుతోంది. మంగళవారం సాయంత్రానికి 19,720 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులు (కెపాసిటీ 90.31 టీఎంసీలు) కాగా.. 1081.20 అడుగుల నీళ్లు (55.81 టీఎంసీలు) ఉన్నాయి. మహారాష్ట్రలోని జైక్వాడ్​ ప్రాజెక్టుకు పై నుంచి 3,189 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తుండగా అంతే నీటిని కిందికి
వదులుతున్నారు.

మిడ్​ మానేరు ఖాళీయే

మిడ్‌‌  మానేరుకు 400 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తుండగా, 2,925 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. మిడ్​ మానేరులో 25.87 టీఎంసీల కెపాసిటీకిగాను 4.18 టీఎంసీల నీళ్లున్నాయి. లోయర్​ మానేరు డ్యాంలోకి 3,436 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో వస్తోంది. ఈ డ్యాం కెపాసిటీ 24.07 టీఎంసీలకు.. ప్రస్తుతం 16.03 టీఎంసీల నీళ్లున్నాయి.

కృష్ణాలో నీళ్లు ఫుల్..

కృష్ణా బేసిన్‌‌ ప్రాజెక్టులకు ఓ మోస్తరు వరద కొనసాగుతోంది. ఈ బేసిన్‌‌లో ప్రాజెక్టులు ఇప్పటికి నిండిపోయాయి. రెండు సార్లు భారీ వరదలు రావడంతో అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని సముద్రంలోకి వదిలారు. ఆల్మట్టికి 15 వేల క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే నీటిని కిందికి వదులుతున్నారు. జూరాలకు 52 వేల క్యూసెక్కులు వస్తుండగా.. 53,899 క్యూసెక్కులను వివిధ పథకాలకు, నదిలోకి విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 29,040 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో ఉండగా 83,585 క్యూసెక్కులను కాల్వలు, కరెంటు ఉత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌‌కు 96,551 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో ఉంటే.. అంతే వదులుతున్నారు. ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తారు. పులిచింతల ప్రాజెక్టులోకి 99,798 క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో ఉండగా.. గేట్లు ఎత్తి 85 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేస్తున్నారు.