రాష్ట్రానికి ఎల్లో అలర్ట్

రాష్ట్రానికి ఎల్లో అలర్ట్

రాష్ట్రానికి మరో ఐదు రోజులకు వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో వారం రోజలుగా వర్షాలు పడుతూనే ఉన్నాయి. దీంతో పంటలు దెబ్బతింటాయన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. పొద్దంతా ఎండ దంచికొట్టి.. సాయంత్రానికి ఒక్కసారిగా వెదర్ ఛేంజ్ అయి భారీ వర్షం పడుతుంది. వారం రోజులుగా రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కొనసాగుతోంది. ఇవాళ కూడా పొద్దంతా ఎండ కొట్టి సాయంత్రానికి వాతావరణం చల్లబడింది. వరంగల్, హనుమకొండలో తేలికపాటి మోస్తరు వర్షం కురిసింది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్ మండలాల్లో మోస్తరు వాన పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి.

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వర్షంతో జనం అవస్థలు పడ్డారు. హుజురాబాద్, శంకరపట్నం మండలాల్లో ఉరుములతో మోస్తరు వర్షం పడింది. కుమ్రం భీం జిల్లా కౌటాల మండలంలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతో జనం ఇళ్లలో నుంచి బయటికి రాలేకపోయారు. కాగజ్ నగర్ మండలంలో మోస్తరు వర్షం కురిసింది.

మరోవైపు ఈ నెల 14 వరకు రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ , వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది.

రేపు, ఎల్లుండి చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో.. గురువారం నుంచి శుక్రవారం వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.