
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఉత్తర తెలంగాణలోని ఏజెన్సీ ఏరియాలతో పాటు.. దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉదయం10 దాటినా పొగమంచు పోవడం లేదు. దట్టంగా కమ్మేస్తున్న మంచుతో రోడ్ల మీద ముందు వెళ్లే వాహనాలు, ఎదురొచ్చే బండ్లు కనిపించడం లేదు. అర్ధరాత్రి 2 గంటల నుంచే పొగమంచు కమ్ముకుంటున్నది. మరో రెండు మూడు రోజుల పాటు పొగమంచు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, టెంపరేచర్లు పడిపోయే చాన్స్ ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
ఈ మేరకు శనివారానికి18 జిల్లాలకు ఎల్లో అలర్ట్జారీ చేసింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్మల్కాజిగిరి, మెదక్ జిల్లాల్లో పొగమంచు తీవ్రంగా ఉంటుందని హెచ్చరించింది. పలు జిల్లాల్లో పగటిపూట టెంపరేచర్లు 30 డిగ్రీలలోపే నమోదవుతాయని తెలిపింది. జనవరి మొదటి వారంలో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉన్నట్టు అధికారులుచెప్తున్నారు.
15 డిగ్రీల లోపే రాత్రి టెంపరేచర్లు
మరోవైపు తెలంగాణ స్టేట్డెవలప్మెంట్ప్లానింగ్సొసైటీ(టీఎస్డీపీఎస్) ప్రకారం గురువారం రాత్రి టెంపరేచర్లు సూర్యాపేట, హైదరాబాద్మినహా మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలలోపు నమోదయ్యాయి. అత్యల్పంగా వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 10.4 డిగ్రీల నైట్ టెంపరేచర్ రికార్డయింది. రంగారెడ్డి జిల్లా షాబాద్లో 10.9, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్లో 11, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లలో 11.6, మహబూబ్నగర్ జిల్లా బాలానగర్లో 12, నాగర్కర్నూల్ జిల్లా బాల్మూరు, కామారెడ్డి జిల్లా జుక్కల్లలో 12.4, మెదక్ జిల్లా ఎల్దుర్తి, జోగులాంబ గద్వాల్లో12.6, నిర్మల్ జిల్లా పెంబి, సిద్దిపేట జిల్లా కొండపాకల్లో 12.7, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్లో 12.8, నల్గొండ జిల్లా చింతపల్లిలో 13 డిగ్రీల చొప్పున కనీస ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
నీటి ఆవిరి ఎక్కువగా ఉండటం వల్లే
వాతావరణంలో నీటి ఆవిరి ఎక్కువగా ఉండటం వల్ల పొగ మంచు తీవ్రత పెరుగుతున్నదని వాతావరణ శాఖ సైంటిస్ట్ డాక్టర్ శ్రావణి తెలిపారు. రాత్రి టెంపరేచర్లు తక్కువగా నమోదవుతుండటం వల్ల నీటి ఆవిరి పొగమంచులాగా మారుతున్నదని పేర్కొన్నారు. నీటి ఆవిరి వంద శాతానికి పైగానే ఉంటుండటంతో పొగమంచు దట్టంగా అలుముకుంటున్నదని, ఫలితంగా అరకిలోమీటరు దూరంలోని వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడుతున్నదని చెప్పారు. వీలైనంత వరకు తెల్లవారుజామున ప్రయాణాలను మానుకుంటేనే మంచిదని ఆమె సూచించారు.