మహబూబ్‌నగర్ అర్బన్, వెలుగు : యువత తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం ద్వారానే ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలరని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో టాస్క్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ పూర్తి చేసుకున్న 34 మంది విద్యార్థులకు ఆయన సర్టిఫికెట్లు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు యువత భవిష్యత్‌కు కీలకమని, నేర్చుకున్న నైపుణ్యాలతో జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మల్లు నర్సింహారెడ్డి, మేయర్ గుమ్మాల మమత, టాస్క్ జిల్లా మేనేజర్ ఎండీ సిరాజ్, నాయకులు పాల్గొన్నారు.
