యెస్​ బ్యాంక్ ​ప్రాఫిట్‌‌ 79 శాతం డౌన్‌‌

యెస్​ బ్యాంక్ ​ప్రాఫిట్‌‌  79 శాతం డౌన్‌‌

న్యూఢిల్లీ: ఐసీఐసీఐ, కోటక్​, ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్‌‌, యెస్ ​బ్యాంకులు  ఒకే రోజు క్యూ3 ఫలితాలను ప్రకటించాయి. ఐసీఐసీఐ, కోటక్, ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్​ బ్యాంకులు ఆశించిన ఫలితాలు సాధించినా యెస్​ బ్యాంక్​ వెనుకబడిపోయింది.  మొండిబాకీలకు ఎక్కువ కేటాయింపులు చేయాల్సిన రావడం ఇందుకు కారణం. అయితే ఈ బ్యాంకు లోన్​ డిస్బర్సల్స్​ పెరిగాయి. ఐసీఐసీఐ బ్యాంక్​కు పోయిన ఏడాది డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్​( క్యూ3) లాభం 34 శాతం పెరిగి రూ.8,312 కోట్లకు చేరుకుంది. ఈ ప్రైవేట్ రంగ బ్యాంక్​కు 2022 డిసెంబర్ తో ముగిసిన క్వార్టర్​లో వచ్చిన లాభంతో పోలిస్తే ఇది 34 శాతం ఎక్కువ.   క్రితం ఏడాది ఇదే క్వార్టర్​లో బ్యాంక్ రూ.6,194 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దీంతో నికర వడ్డీ ఆదాయం బాగా పెరిగింది.  మొత్తం ఆదాయం గత డిసెంబర్ క్వార్టర్​లో రూ.27,069 కోట్ల నుంచి రూ.33,529 కోట్లకు పెరిగిందని బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌‌‌‌లో పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం (ఎన్‌‌‌‌ఐఐ) ఏడాది క్రితం మూడో క్వార్టర్​లో రూ.12,236 కోట్ల నుంచి 34.6 శాతం పెరిగి రూ.16,465 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ (ఎన్​ఐఎం) కూడా ఏడాది క్రితం ఇదే కాలంలో 3.96 శాతంతో పోలిస్తే 4.65 శాతానికి మెరుగుపడింది. స్థూల ఎన్​పీఏలు పోయిన ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్​ ముగింపులో 4.13 శాతంతో పోలిస్తే ఈసారి 3.07 శాతానికి తగ్గిపోయాయి. నికర ఎన్‌‌‌‌పీఏలు కూడా ఏడాది క్రితం ఇదే కాలంలో 0.84 శాతం నుంచి 0.55 శాతానికి తగ్గాయి. 2022 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్​లో బ్యాంక్ కన్సాలిడేటెడ్ లాభం రూ.6,536 కోట్ల నుంచి 34.5 శాతం పెరిగి రూ.8,792 కోట్లకు చేరుకుంది.

కోటక్ బ్యాంక్ లాభం రూ.2,792 కోట్లు

కోటక్ మహీంద్రా బ్యాంక్ క్యూ3 స్టాండ్ అలోన్ లాభం 31 శాతం జంప్ చేసి రూ.2,792 కోట్లకు చేరుకుంది.  క్రితం ఏడాది ఇదే క్వార్టర్​లో బ్యాంక్ రూ.2,131 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఇదే కాలంలోబ్యాంక్ మొత్తం ఆదాయం  రూ.8,260 కోట్ల నుంచి రూ.11,099 కోట్లకు పెరిగింది. 2023 ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్​ నికర వడ్డీ ఆదాయం (ఎన్​ఐఐ) 2022 ఆర్థిక సంవత్సరం  మూడో క్వార్టర్​తో పోలిస్తే రూ.4,334 కోట్ల నుంచి 30 శాతం పెరిగి రూ.5,653 కోట్లకు చేరుకుందని పేర్కొంది.  తాజా క్యూ3 నికర వడ్డీ మార్జిన్ (ఎన్​ఐఎం) 5.4 శాతంగా ఉంది. అసెట్​ క్వాలిటీని చూస్తే స్థూల ఎన్​పీఏలు 2.71 శాతం నుంచి 1.90 శాతానికి పడిపోయాయి. నికర ఎన్‌‌‌‌పీఏలు ఏడాది క్రితం ఇదే కాలంలో 0.79 శాతం నుంచి 0.43 శాతానికి తగ్గాయి. డిసెంబరు క్వార్టర్​లో క్యాపిటల్​ అడెక్వసీ రేషియో 21.29 శాతం నుంచి 19.66 శాతానికి తగ్గింది.

భారీగా తగ్గిన యెస్​ బ్యాంకు లాభం  

యెస్ బ్యాంక్​కు డిసెంబర్ క్వార్టర్​ నికరలాభం 79 శాతం తగ్గి రూ. 55.07 కోట్లకు పరిమితమయింది. మొండిబాకీలకు అధిక మొత్తాలను కేటాయించాల్సి రావడమే ఇందుకు కారణం.  క్యూ3లో అడ్వాన్స్‌‌‌‌లు 0.10 పది శాతం, నికర వడ్డీ మార్జిన్​ 2.5 శాతం పెరిగాయి. నికర వడ్డీ ఆదాయం 11.7 శాతం జంప్ చేసి రూ. 1,971 కోట్లకు చేరుకుంది. వడ్డీయేతర ఆదాయం 55.8 శాతం పెరిగి రూ. 1,143 కోట్లకు చేరుకుంది.  రూ. 100 కోట్ల కార్పొరేట్ బాండ్‌‌‌‌ల విక్రయం చాలా వరకు సహాయపడింది. మొత్తం కేటాయింపులు గత క్యూ3తో పోలిస్తే ఈసారి రూ. 375 కోట్ల నుంచి రూ. 845 కోట్లకు పెరిగాయని, లెగసీ బ్యాడ్ అసెట్స్- ఇందుకు కారణమని బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రశాంత్ కుమార్ వివరించారు. జేసీ ఫ్లవర్స్ అసెట్ రీకన్‌‌‌‌స్ట్రక్షన్ కంపెనీకి ఎన్​పీఏలలో ఎక్కువ భాగం బదిలీ చేయడం వల్ల స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి సీక్వెన్షియల్​గా 13 శాతం నుంచి 2 శాతానికి పడిపోయింది. ఈ క్వార్టర్​లో గ్రాస్​ స్లిప్పేజ్‌‌‌‌లు రూ.1,610 కోట్లుగా ఉన్నాయి. బ్యాంక్ ఇప్పటి వరకు రూ. 4,300 కోట్ల లోన్లను రికవరీ చేసింది. 2022,  డిసెంబర్ 31 నాటికి మొత్తం క్యాపిటల్​ అడెక్వసీ రేషియో 18 శాతంగా ఉంది.

ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్ బ్యాంక్ లాభం డబుల్‌‌

ఐడీఎఫ్‌‌‌‌సీ ఫస్ట్ బ్యాంక్ నికర లాభం క్యూ3 లో  రెండింతలు పెరిగి రూ.605 కోట్లకు ఎగిసింది. 2021 లోని డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో రూ. 281 కోట్ల నికర లాభాన్ని ఈ బ్యాంక్ ప్రకటించింది. గ్రోత్ బాగుండడం, ఆపరేటింగ్ ఇన్‌‌కమ్‌‌ మెరుగుపడడంతో  బ్యాంక్ లాభం  పెరిగిందని ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్ బ్యాంక్ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. బ్యాంక్  నికర వడ్డీ ఆదాయం క్యూ3 లో  ఏడాది ప్రాతిపదికన 27 శాతం  ఎగిసి రూ.3,285 కోట్లకు చేరుకుంది.  2021 లోని డిసెంబర్ క్వార్టర్‌‌‌‌లో ఇది రూ. 2,580 కోట్లుగా ఉంది.  క్యూ3 లో ప్రొవిజన్లు 15 శాతం పెరిగి రూ.450 కోట్లకు చేరుకున్నాయని ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్ బ్యాంక్ వెల్లడించింది.  బ్యాంక్ కాసా రేషియో 50 శాతానికి మెరుగుపడిందని, రిటైల్ డిపాజిట్స్‌‌ సెగ్మెంట్‌‌ స్ట్రాంగ్‌‌గా ఉందని  బ్యాంక్ ఎండీ వీ వైద్యనాథన్‌‌ పేర్కొన్నారు. మొత్తం  కస్టమర్ల డిపాజిట్లలో రిటైల్‌‌ సెగ్మెంట్ వాటా 77 శాతంగా ఉందని వెల్లడించారు.  కస్టమర్లను దృష్టిలో పెట్టుకొని ప్రొడక్టులు తీసుకురావడం, కార్పొరేట్ గవర్నెన్స్, ఎథిక్స్‌‌, డిజిటల్ ఇన్నోవేషన్స్‌‌లో స్ట్రాంగ్‌‌ బ్రాండింగ్ ఉండడంతో డిపాజిట్లు మెరుగయ్యాయని అన్నారు.   ఐడీఎఫ్‌‌సీ ఫస్ట్ బ్యాంక్ షేరు శుక్రవారం రూ.59.45 వద్ద క్లోజయ్యింది.