యోగా పుట్టింది నేపాల్‌లో.. భారత్‌లో కాదు

యోగా పుట్టింది నేపాల్‌లో.. భారత్‌లో కాదు

యోగా పుట్టుకపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగా పుట్టింది నేపాల్ లోనేనని, భారత్‌లో కాదని ఆయన అన్నారు. యోగా ప్రపంచానికి పరిచయం అయినప్పుడు భారత్ అనే దేశమే లేదని ఓలి అన్నారు. సోమవారం ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా.. తన నివాసం బలూవతార్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఓలీ పై వ్యాఖ్యలు చేశారు. యోగా పరిచయమైన సమయంలో భారత్ ఒక ఉపఖండం అని ఆయన అన్నారు. యోగాను కనుగొన్న నేపాల్ వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చెప్పలేకపోయామని ఓలి అన్నారు. ఈ విషయంలో మోడీ సక్సెస్ అయ్యారని ఆయన అన్నారు. 

రాముడి జన్మస్థలం అయోధ్య నేపాల్‌లో ఉందని.. రాముడు నేపాలీ అని ఓలి గత ఏడాది జూలైలో వ్యాఖ్యానించారు. ‘నిజమైన అయోధ్య బిర్గుంజ్‌కు పశ్చిమాన ఉన్న థోరి అనే నగరంలో ఉంది. రాముడు అక్కడే జన్మించాడని భారతదేశం పేర్కొంది. వాస్తవానికి అయోధ్య బిర్గుంజ్‌కు పశ్చిమాన ఉన్న ఒక గ్రామం’అని ఓలి పేర్కొన్నారు. నకిలీ అయోధ్యను సృష్టించడం ద్వారా సాంస్కృతిక ఆక్రమణకు భారతదేశం కారణమవుతుందని ఆయన ఆరోపించారు.