ఇన్నేండ్ల సర్వీస్​లో నేను చూసిన వేస్ట్​ బ్యాచ్​ మీరే

ఇన్నేండ్ల సర్వీస్​లో నేను చూసిన వేస్ట్​ బ్యాచ్​ మీరే

టీచర్లు.. బడిలో అమ్మలా ప్రేమని పంచుతారు. నాన్నలా మన భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ఓ మంచి ఫ్రెండ్​లా గైడ్​ చేస్తారు. తోబుట్టువుల్లా ధైర్యాన్ని నింపుతారు. సొసైటీలో ఎలా నడుచుకోవాలో నేర్పిస్తారు. వీటన్నింటికి బదులుగా మన ఎదుగుదలని మాత్రమే కోరుకుంటారు. అదే వాళ్లకి సంతోషం.. అలా మన జీవితంలో కీ రోల్ పోషించిన గురువులందర్నీ  ఈ టీచర్స్​ డే రోజున  జ్ఞాపకాల పెట్టె తెరిచి  పలకరించొద్దామా!
జోవియల్​, మూడీ, కాస్త కన్ఫ్యూజన్​, స్ట్రిక్ట్​ .. క్లాస్​ రూమ్​లోనే కాదు ఆ క్లాసులు చెప్పే టీచర్లూ ఒక్కొక్కరు ఒక్కోలా ఉంటారు. వాళ్ల గురించి చెప్పాలంటే.. ముందు ఫేవరెట్​​ నుంచి మొదలుపెడదాం.

  • ప్రతి స్టూడెంట్​ లైఫ్​లో ఒక ఫేవరెట్​ టీచర్​ ఉంటారు. ఆ ఇష్టానికి కారణం ఆ ఫలానా మాష్టారు చెప్పే పాఠాలే కాదు.. వాళ్ల పర్సనాలిటీ కూడా. ఎప్పుడూ స్టూడెంట్స్​ని కడుపుబ్బా నవ్విస్తుంటారు ఈ ఫేవరెట్​ టీచర్లు​. ఫస్ట్​ బెంచ్​​ సుకన్య నుంచి మొదలుపెట్టి, చివరి బెంచ్ మీద​​ చివరాఖర్న కూర్చున్న సుదేశ్​ వరకు అందర్నీ పలకరిస్తారు. పిల్లలతో ఓ ఫ్రెండ్​లా కలిసిపోతారు. పాఠాలతో పాటు అన్ని విషయాలు చెప్తారు. అందుకే వీళ్లు చాలామందికి ఫేవరెట్​. 
  • క్లాస్​​ రూమ్​ గుమ్మం నుంచే​ పాఠం మొదలుపెట్టే టీచర్లు​ ప్రతి ఒక్కరి లైఫ్​లో ఉంటారు. పీరియడ్​ ముగిసినా.. వీళ్ల పాఠం వినబడుతూనే ఉంటుంది. ఏ టీచర్​ సెలవులో ఉన్నా వాళ్ల పీరియడ్​ టైంకి క్లాసులో దూరిపోతారు. కొన్ని సార్లు వేరే టీచర్లని బతిమాలి మరీ క్లాసులు తీసుకుంటారు. పొరపాటున వీళ్ల క్లాసు​ లాస్ట్​ అవర్​లో వచ్చిందో.. ఇక అంతే. మార్కులు తక్కువొస్తే బెత్తం దెబ్బలు, పాఠం గుర్తుంచుకోకపోతే గుంజీలు. ఇవన్నీ చూసి ‘ఈ సర్​/మేడమ్​ ​ బాగా స్ర్కిక్ట్​ అని అప్పుడు తప్పించుకొని తిరిగినా.. ఇప్పుడు ఆలోచిస్తే మన​ భవిష్యత్తు కోసం వాళ్లు పడ్డ ఆరాటమే కనిపిస్తుంది. 
  • ‘ఇన్నేండ్ల సర్వీస్​లో నేను చూసిన వేస్ట్​ బ్యాచ్​ మీరే’ అంటూ మొదలుపెడతారు ఫ్రస్ట్రేషన్​ టీచర్లు. ‘మీరు దేనికీ పనికిరారు’ అంటూ  తిడుతుంటారు. వందకి తొంభై తొమ్మిది మార్కులొచ్చినా స్టూడెంట్​ని మెచ్చుకోరు. కొన్నిసార్లు ఇంకా బాగా చదవాలని మార్కులు తగ్గించి వేస్తుంటారు కూడా. 
  • రోజూ బెత్తం పట్టుకొని క్లాసుకి వస్తారు కొందరు టీచర్లు​. ప్రశ్నలకి జవాబు చెప్పలేదో మీ పని అంతే అంటూ భయానికే భయం పుట్టిస్తారు. కానీ, ఏ రోజూ ఆ బెత్తానికి పని చెప్పరు వీళ్లు. పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చినా.. ‘ఇంకోసారి మంచి మార్కులు రాకపోతే’ అంటూ బెదిరిస్తారే తప్ప పనిష్మెంట్​ ఇవ్వరు. ఎవరైనా ఇబ్బంది పడుతున్నా చూడలేరు. వీళ్ల వీక్​ పాయింట్ తెలిసిన స్టూడెంట్స్​ రోజుకో సాకుతో వీళ్లని మభ్యపెడుతుంటారు. 
  • లెక్కల టీచర్​ హోంవర్క్​ ఎక్కువ ఇచ్చినా.. సోషల్​ సార్​ ఆటల టైంలో ఎక్స్​ట్రా క్లాసు తీసుకున్నా ఊరుకోని పీఇటీ టీచర్లు ఉంటారు. పిల్లలకి చదువు ఎంత ముఖ్యమో ఆటలు, పాటలు కూడా అంతే ముఖ్యం అన్నది ఈ టీచర్ల వాదన. జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి..వాటిని ఎలా ఫేస్​ చేయాలి.. లాంటి విషయాలు చెప్తుంటారు. వీళ్లు ప్రతి సందర్భంలో ఇన్​స్పైర్​ చేస్తుంటారు.  ఇలా మన జీవితంలో అడుగడుగునా అండగా నిలిచిన గురువులందరికీ ఈ టీచర్స్​ డే రోజున స్పెషల్​ థ్యాంక్స్​ చెప్పుకుందాం.