‘డీపీడీపీ ’ సవరణ చట్టం ద్వారా.. పారదర్శకతకు పాతర!

‘డీపీడీపీ ’ సవరణ చట్టం ద్వారా..  పారదర్శకతకు పాతర!

భారతదేశంలో అత్యంత విప్లవాత్మక ప్రజాస్వామ్య సాధనంగా ఒకప్పుడు ప్రశంసలు అందుకున్న ఆర్టీఐ చట్టం, నేడు ఆలస్యం,-  నిరాకరణ-, నిరుపయోగం అనే మూడు రూపాల్లో క్రమంగా నిర్వీర్యం చేయబడుతోందనే తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

పౌరుల చేతుల్లోని ఈ సాధనాన్ని క్రియారహితం చేసేందుకు గత ఐదేళ్లలో జరిగిన వరుస చట్ట సవరణలు పారదర్శకత ప్రధాన స్తంభాలను క్రమంగా కూల్చివేశాయి. గత ఐదేళ్లలో ఈ చట్టంపై రెండు సవరణలు జరిగాయి. మొదటిది, 2009లో పార్లమెంట్ చేసిన సవరణ. సమాచార కమిషనర్ల జీతాలు, సేవా నిబంధనలను నిర్ణయించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది. 

సమాచార కమిషనర్లు  కార్యనిర్వాహక వర్గం అదుపులోకి వెళ్లడం ఆందోళనకరం. వారు అధికారులపై చర్య తీసుకోవడంలో సంకోచిస్తారని పారదర్శక నిపుణులు గట్టిగా వాదిస్తున్నారు. ఈ మార్పు  సమాచార వ్యవస్థ సమగ్రత ప్రారంభ దశలోనే బలహీనపడిందని న్యాయ నిపుణులు వాదించారు. 

రెండవది, 2023లో పార్లమెంట్ ఆమోదించిన ‘డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్’ (డీపీడీపీ) చట్టం ద్వారా ఆర్​టీఐ చట్టంలోని కీలకాంశమైన సెక్షన్ 8(1)(j) కి చేసిన మార్పు. ఈ సవరణ, కేవలం వ్యక్తిగత గోప్యతను కాపాడటం అనే సున్నితమైన ముసుగులో, సమాచార హక్కు ప్రధాన ఉద్దేశాన్ని నిర్వీర్యం చేసిందనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సవరణ అవసరం లేనిది మాత్రమే కాదు, పారదర్శకతకు పునాదిగా ఉన్న సమతుల్యతను సైతం దెబ్బతీసిందని న్యాయ నిపుణులు, ఆర్​టీఐ కార్యకర్తలు ఘోషిస్తున్నారు.

సమతుల్యత దెబ్బతీసిన మినహాయింపు

మునుపటి ఆర్​టీఐ చట్టం, సెక్షన్ 8(1)(j) కింద, వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయకుండా మినహాయింపు ఇచ్చింది. అయితే, ఇక్కడే 'బ్యాలెన్సింగ్ టెస్ట్'  ఉండేది. ‘ఆ సమాచారాన్ని బహిర్గతం చేయడం ద్వారా ప్రజా ప్రయోజనం  నెరవేరుతుందని భావించినట్లయితే, దానిని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది’. ఈ నిబంధన గోప్యత , పారదర్శకత  హక్కుల మధ్య ఒక సున్నితమైన న్యాయపరమైన సమతుల్యతను నెలకొల్పింది. 

ఉదాహరణకు, ప్రభుత్వ ప్రాజెక్టుల టెండర్ వివరాలు, లేదా మంత్రుల విదేశీ పర్యటనల ఖర్చు వివరాలు వంటివి వ్యక్తిగత సమాచారం పరిధిలోకి వచ్చినా, ప్రజా ప్రయోజనం బలంగా ఉన్నందున వాటిని బహిర్గతం చేసేవారు. ఈ నిబంధన కారణంగానే అనేక అవినీతి కుంభకోణాలు, ప్రభుత్వ నిర్ణయాల వెనుక ఉన్న వాస్తవాలు వెలుగులోకి  వచ్చాయి. 

తిరుగులేని కవచం

డీపీడీపీ చట్టం ద్వారా తీసుకొచ్చిన సవరణ ఈ చారిత్రక సమతుల్యతను పూర్తిగా తొలగించింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే, డీపీడీపీ చట్టంలోని సెక్షన్ ద్వారా ఆర్​టీఐ చట్టంలోని  ‘ప్రజా ప్రయోజనం’ తొలగింపు ఫలితంగా, వ్యక్తిగత సమాచారం అనే వర్గంలోకి వచ్చే దేనినైనా బహిర్గతం చేయకుండా నిరాకరించడానికి ప్రభుత్వ అధికారులకు ఒక తిరుగులేని ఆధారంగా లభించింది. 

ఏవిధమైన ప్రజా ప్రయోజనం చూపించినా సరే, వ్యక్తిగత సమాచారాన్ని గోప్యత పేరుతో నిరాకరించే సంపూర్ణ అధికారాన్ని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లకు (PIOs) ఈ సవరణ కట్టబెట్టింది. డీపీడీపీ చట్ట నిబంధనలు ఇప్పుడు ఆర్​టీఐ చట్టాన్ని అధిగమించే  ప్రభావాన్ని చూపాయి.

 డీపీడీపీ చట్టం ఇంకా పూర్తిగా అమలులోకి రానప్పటికీ, ఈ సవరణ మాత్రం సమాచార హక్కుపై తీవ్ర 
ప్రభావాన్ని చూపనుంది. అవినీతి, ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన విషయాలలో కూడా, ఆ సమాచారం వ్యక్తిగత వివరాలను కలిగి ఉందనే సాధారణ కారణంతో సమాచారం నిరాకరించబడే అవకాశం ఉంది.

ప్రజాస్వామ్యంపై ప్రతికూల ప్రభావం

ఈ సవరణ అత్యంత ప్రమాదకరమైన ధోరణికి దారితీస్తుంది. గోప్యత హక్కు  అనేది సుప్రీంకోర్టు  చరిత్రాత్మక పుట్టస్వామి తీర్పు ద్వారా రాజ్యాంగంలోని అధికరణ 21 కింద ఒక ప్రాథమిక హక్కుగా నిర్ధారించబడింది. 

అయితే, ఏ ప్రాథమిక హక్కు కూడా సంపూర్ణమైనది కాదు. ప్రతి హక్కు పౌరుల ఇతర హక్కులు, ప్రజా భద్రత,  ప్రజా ప్రయోజనం అనే హేతుబద్ధమైన పరిమితులకు లోబడి ఉంటుంది. కానీ, డీపీడీపీ చట్టం ద్వారా ఆర్​టీఐ చట్టంలో చేసిన ఈ సవరణ, గోప్యత హక్కును ఒక సంపూర్ణ హక్కుగా పరిగణించి, పౌరుల సమాచార హక్కును, ప్రజా ప్రయోజనం గురించి తెలుసుకునే హక్కును అణచివేసే మార్గాన్ని సుగమం చేసింది. 

ప్రభుత్వ అధికారుల యొక్క వ్యక్తిగత పనితీరు, వారి ఆస్తుల వివరాలు, వారిపై వచ్చిన అవినీతి ఫిర్యాదుల వివరాలు వంటి కీలక సమాచారాన్ని ఇకపై గోప్యత కారణాలతో సులభంగా దాచిపెట్టవచ్చు. దీని వలన ప్రభుత్వంలో జవాబుదారీతనం తగ్గుతుంది, పాలనలో రహస్యం పెరుగుతుంది, అవినీతికి పరోక్షంగా ఊతం లభిస్తుంది.

న్యాయ సమీక్ష ఆవశ్యకత

డీపీడీపీ చట్టం యొక్క ఉద్దేశం డిజిటల్ యుగంలో పౌరుల వ్యక్తిగత డేటాను రక్షించడమే అయినప్పటికీ, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి పారదర్శకత చట్టాన్ని బలి ఇవ్వడం సమంజసం కాదు. సవరణతో సంపూర్ణ మినహాయింపును తీసుకొచ్చే ప్రయత్నం ఆర్​టీఐ చట్టంపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడిగా కనిపిస్తుంది. 

గోప్యత, పారదర్శకత అనేవి ఒకే నాణేనికి ఉన్న రెండు వైపులలాంటివి. ఒకదాన్ని బలపరిచే క్రమంలో మరొకటి బలహీనం కాకూడదు. ఈ సవరణ ప్రజాస్వామ్య వ్యవస్థ మౌలిక విలువలకు విఘాతం కలిగిస్తున్నందున, తక్షణమే ఈ అంశాన్ని ఉన్నత న్యాయస్థానాలు పరిశీలించాలి. లేదంటే, భారతదేశంలో పారదర్శకత స్వర పేటిక శాశ్వతంగా  మూసుకుపోయినట్లే.

- డా.కట్కూరి న్యాయ నిపుణుడు-