సంపాదించే భార్యకు భరణం ఇవ్వక్కర్లేదు..ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

సంపాదించే భార్యకు భరణం ఇవ్వక్కర్లేదు..ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

శాశ్వత భృతి అనేది సామాజిక న్యాయానికి ఒక సాధనం మాత్రమే 
రైల్వే అధికారిణికి భర్తనుంచి భరణం నిరాకరిస్తున్నట్టు వెల్లడి

న్యూఢిల్లీ: విడాకుల కేసులో ఢిల్లీ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న మహిళకు భర్త భరణం చెల్లించాల్సిన అవసరంలేదని తేల్చి చెప్పింది. శాశ్వత భృతి అనేది సామాజిక న్యాయానికి ఒక సాధనం మాత్రమేనని, సామర్థ్యం ఉన్న వ్యక్తుల మధ్య ఆర్థిక సమానత్వం లేదా ఆర్థిక సంపన్నత కోసం కాదని కోర్టు పేర్కొన్నది. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారిణి తన భర్త నుంచి శాశ్వత జీవనాధార భృతి కోరుతూ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 

విచారించిన కోర్టు భరణం నిరాకరిస్తూ  క్రూరత్వం ఆధారంగా భర్తకు విడాకులు మంజూరు చేసింది. ఈ ఆదేశాన్ని సవాలు చేస్తూ ఆ మహిళ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌‌‌‌పై  జస్టిస్ అనిల్ క్షేతర్‌‌‌‌పాల్ , హరీశ్ వైద్యనాథన్ శంకర్‌‌‌‌తో కూడిన డివిజన్ బెంచ్ శనివారం విచారణ చేపట్టింది. భరణం కోరుకునే వ్యక్తి ఆర్థిక సహాయం కోసం నిజమైన అవసరాన్ని నిరూపించాలని చట్టం కోరుతున్నదని అభిప్రాయపడింది. 

భార్య ఒక సీనియర్ ప్రభుత్వ అధికారిణిగా మంచి ఆదాయం సంపాదిస్తున్నదని, కాబట్టి ఆమె ఆర్థికంగా స్వతంత్రురాలని కోర్టు నిర్ధారించింది. హిందూ వివాహ చట్టం సెక్షన్ 25 కింద జీవనాధార భృతి కోరుకునే వ్యక్తి ఆర్థిక అవసరాన్ని నిరూపించాలని, ఆమె అలాంటి అవసరాన్ని నిరూపించలేకపోయిందని పేర్కొంది. ఆర్థికంగా స్వతంత్రంగా, స్వయం సమృద్ధిగా ఉన్నప్పుడు భరణం మంజూరు చేయలేమని చెప్పింది. ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును బెంచ్​ సమర్థించింది.