ఈవీ సవాళ్లను భారత్‌‌‌‌ అధిగమించగలదా!

ఈవీ సవాళ్లను భారత్‌‌‌‌ అధిగమించగలదా!

2030 నాటికి సాలీనా10 మిలియన్ల ఎలక్ట్రిక్‌‌‌‌ వాహనాలను (ఈవీ) అమ్మేస్థాయికి చేరాలని,  ఈవీ- రంగంలో 50 మిలియన్‌‌‌‌ ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో  భారత్‌‌‌‌ ముందుకు సాగుతోంది. ఈ లక్ష్య సాధనకు అవకాశాలు ఉండగా, సవాళ్ళు కూడా ఎదురవుతాయని గుర్తించాలి. 

ఈవీ- రంగం పుంజుకోవడానికి మౌలిక వసతుల కొరత, అధిక ధరల అసౌకర్యం లాంటి అంశాలు ఈవీ- విప్లవాన్ని సవాల్​చేస్తున్నాయి.  నేడు  ప్రపంచంలోనే  మూడో అతి పెద్ద ఆటోమొబైల్‌‌‌‌  మార్కెట్‌‌‌‌ కలిగిన భారత్‌‌‌‌  రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్‌‌‌‌ వాహన రంగాన్ని ప్రోత్సహిస్తూ ఈవీ- రంగంలో గ్లోబల్‌‌‌‌ లీడర్‌‌‌‌గా  కూడా  ఎదగడానికి  ప్రయత్నాలు చేస్తున్నది. 

ఈవీల  మెయింటెనెన్స్‌‌‌‌ తక్కువ

ఈవీ- రంగం పుంజుకోవడం వల్ల పర్యావరణ కాలుష్యంతో  మగ్గుతున్న మహానగరాల్లో పట్టణవాసులకు ఉపశమనం కలిగి  ఆరోగ్య భాగ్యం కలుగుతున్నది.  భారత్‌‌‌‌లో  విడుదలయ్యే హరిత గృహ వాయువుల్లో 10 శాతానికి పైగా రవాణా రంగం ద్వారానే  వెలువడుతున్నది.  ఎలక్ట్రిక్‌‌‌‌ వాహనాల వినియోగం పెరిగితే పర్యావరణ కాలుష్యం లేదా కార్బన్‌‌‌‌ ఉద్గారాలు అధిక మొత్తంలో తగ్గుతుందని,  ప్రజారోగ్యం కుదుటపడుతుందని, దీని ఆధారంగానే ఈవీ- రంగానికి సబ్సిడీలు  కూడా  ఇస్తున్నారని  గమనించాలి.  

ఈవీల ధరలు అధికమే అయినా పెట్రోల్‌‌‌‌  లేదా డిజిల్‌‌‌‌  వాహనాలతో  పోల్చితే  వినియోగ ఖర్చులు చాలా తక్కువగా  ఉంటాయని మనకు  తెలుసు. 2023–-24లో ఈవీ- రంగం అమ్మకాలు 45 శాతం వరకు పెరగడం, 2025 నాటికి  ఈవీలు  రిజిస్ట్రేషన్లు  మూడురెట్లు పెరగడం‌‌‌‌ కూడా జరిగిపోయింది.

 చార్జింగ్‌‌‌‌ స్టేషన్లు పెంచాలి

2030 నాటికి భారత ఈవీ- మార్కెట్‌‌‌‌ విలువ 20 ట్రిలియన్ల వరకు చేరవచ్చని,  లిథియం  బ్యాటరీల ఎగుమతుల్లో చురుకైన పాత్రను  పోషించవచ్చని అంచనా వేస్తున్నారు.  అసమానతలు  అధికంగా ఉన్న భారతంలో అధిక పెట్టుబడులు,  వినియోగదారుల  నమ్మకాలు కూడా ఈవీ- రంగాన్ని  ప్రభావితం చేయవచ్చని తెలుస్తున్నది. ఈవీ- రంగ పురోగతికి  ప్రధానంగా చార్జింగ్‌‌‌‌ సెంటర్ల కొరత పట్టి పీడిస్తున్నది.  

నేటికి దేశవ్యాప్తంగా దాదాపు 30,000 చార్జింగ్‌‌‌‌ స్టేషన్లు మాత్రమే ఉన్నాయని,  వీటి సంఖ్య అనేక రెట్లు పెరగాల్సి ఉందని,  మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో కూడా అందుబాటులో ఉండాలని  వినియోగదారులు కోరుకుంటున్నారు. ఈవీ బ్యాటరీల ధరలు కొంత తగ్గినప్పటికీ వాహనాల ధరలు అధికంగా ఉండడం  కొంత  ప్రతిబంధకంగా ఉన్నది.  

ఈవీ ధరల్లో 30 –- 40 శాతం వరకు బ్యాటరీలకే  ఉంటుందని,  వాహనాల  భద్రతా  ప్రమాణాలు కూడా రుజువు కావలసి ఉందని అంటున్నారు.  పర్యావరణహిత  ఈవీ  పరిశ్రమలకు  ఊతం ఇవ్వడం,  వినియోగదారులకు తక్కువ  ధరలకే  వాహనాలు అందించడం,  దేశ నలుమూలల  చార్జింగ్‌‌‌‌ స్టేషన్లు నెలకొల్పడం,  తక్కువ ఖర్చుతో  బ్యాటరీలను  తయారుచేసే  నూతన టెక్నాలజీని అందుబాటులోకి  తేవడంలో  భారత్‌‌‌‌  సాఫల్యత  సాధిస్తే  రానున్న రోజుల్లో ప్రపంచానికి భారత ఈవీ రంగం  దారిదీపంగా మారవచ్చు.  

- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి-