
- పట్టించుకోవడం లేదని దాడి చేసిన్రు
- నిందితులంతా బీజేపీ వారే
- సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి
సిద్దిపేట రూరల్, వెలుగు: ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తే పట్టించుకోలేదనే కోపంతోనే బీజేపీ పార్టీ కార్యకర్తలే ఆయన ఆఫీస్‌పై దాడి చేశారని సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి తెలిపారు. శనివారం ఏసీపీ ఆఫీస్‌లో టూటౌన్ సీఐ రవికుమార్, ఎస్సై అమర్‌తో కలసి ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. ఈ నెల 20న గుర్తుతెలియని ఐదుగురు వ్యక్తులు తన ఆఫీస్‌పై దాడి చేసి వాచ్ మన్‌ను చంపేస్తానని బెదిరించారని 21న సిద్దిపేట టూటౌన్ పీఎస్‌లో చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పట్టణానికి చెందిన కొట్టే నరేంద్ర అలియాస్ చందు, వరుకోలు విజయ్, బోనగిరి హరీశ్, బూరుగు ఆదిత్య రామ్, బండి హర్ష వర్ధన్‌ను నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా చాలా రోజుల నుంచి చక్రధర్ గౌడ్‌ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా పట్టించుకోకపోవడంతో దాడి చేశామని నిందితులు ఒప్పుకున్నారు. వారి నుంచి రెండు బైక్ లు, ఐదు మొబైల్ ఫోన్ లు రికవరీ చేసి జ్యూడీషియల్ రిమాండ్‌కు పంపినట్లు ఏసీపీ తెలిపారు. ఈవిషయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిందని, ఫేక్ న్యూస్ క్రియేట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.