బంగారు తెలంగాణలో బతకడమే పాపమన్నట్టు చేశావ్...

బంగారు తెలంగాణలో బతకడమే పాపమన్నట్టు చేశావ్...

తమ భూమిని అధికారులు గుంజుకుంటున్నరని ఆరోపిస్తూ ఓ పోడు రైతు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై  YSRTP చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ రైతు సెల్ఫీ వీడియో KCR దౌర్భాగ్య పాలనకు నిదర్శనమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాతల తండ్రుల నుంచి పోడు చేసుకొంటున్న భూములను లాక్కొంటే, దొర పాలనలో మాకు బతుకు లేదని సెల్ఫీ వీడియో తీసుకొని మరీ పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మొన్న ఆదివాసీ మహిళలను, పసిపిల్లల తల్లులను  జైల్లో పెట్టించావ్... ఇవాళ రైతుల భూములు లాక్కొని చచ్చేలా చేస్తున్నావ్... అంటూ షర్మిల మండిపడ్డారు. వందల మంది విద్యార్థులు చస్తే కానీ నీకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలనే సోయి రాలేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు ఎంతమంది ఆదివాసీలను చంపితే నీకు పోడు భూములకు పట్టాలివ్వాలని సోయి వస్తుంది? అంటూ రాష్ట్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బంగారు తెలంగాణలో బతకడమే పాపమన్నట్టు చేశావ్... ఆత్మహత్యలే దిక్కు  అనేటట్టు చేశావని వైఎస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు.

తాతల కాలం నుంచి సాగు చేస్తున్న భూమిని ఫారెస్ట్ ఆఫీసర్లు గుంజుకుంటున్నరని మనస్తాపానికి గురైన పోడు రైతు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే.  ఈ ఘటన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన జింక శ్రీశైలం తన తాతల కాలం నుంచి వచ్చిన నాలుగెకరాల పరంపోగు భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఫారెస్ట్ ఆఫీసర్లు, గ్రామ సర్పంచ్ ప్రమీల భర్త సత్తయ్య వెళ్లి శ్రీశైలం వేసిన మిరప పంటను జేసీబీతో తొలగించారు. పంటను ఎందుకు తొలగిస్తున్నారని శ్రీశైలం అడిగితే.. ‘‘ఇది మీ భూమి కాదు. దీనిని ప్రకృతి వనం కోసం కేటాయించాం” అని చెప్పారు. తమ భూమి తీసుకోవద్దని బతిమలాడితే.. న్యాయం చేయాల్సిన సర్పంచ్ తమ సంగతి చూస్తానని బెదిరించాడని శ్రీశైలం తెలిపాడు.