కరోనాతో యువ వైద్యురాలు మృతి

కరోనాతో యువ వైద్యురాలు మృతి
  • కరోనా రోగులకు చికిత్స చేస్తూ.. ఎందర్నో బతికించి తాను బలైంది డాక్టర్ కందికట్ల రోజీ

ఎంబీబీఎస్ ఫస్ట్ క్లాసులో పాసైంది. ఆస్పత్రిలో చేరుతున్న కరోనా రోగులకు ధైర్యంగా సేవలు చేస్తోంది. ఏడాదిగా తన వైద్య సేవలతో ఎంతో మందిని బతికించింది. ఊహించని విధంగా ఎందర్నో బతికించిన ఈ యువ వైద్యురాలు చివరకు అదే కరోనా కోరలకు చిక్కి తనువు చాలించింది ఈ యువ వైద్యురాలు. ఈ వైద్యురాలి పేరు కందికట్ల రోజీ. స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలోని మోరి గ్రామం. కరోనా కాటుకు గురై యువ వైద్యురాలు మరణించిన ఘటన ఉభయ గోదావరి జిల్లాలోనే కాదు యావత్ వైద్య రంగంలో కలకలం రేపింది. 
యువ వైద్యురాలు డాక్టర్ రోజి చిన్ననాటి నుంచే చదువులో చాలా చురకు. అందుకే మంచి మార్కులతో ఉత్తీర్ణురాలై ఎంబీబీఎస్ లో చేరింది. పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు ఆశ్రమంలోనే ఎంబీబీఎస్ పూర్తిచేసి అక్కడే కోవిడ్ రోగులకు చికిత్స చేస్తోంది. సేవలు అందిస్తున్న క్రమంలో యువ వైద్యురాలు అనారోగ్యం బారిన పడింది. అనంతరం ఆమె తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తన స్వగ్రామానికి వెళ్లి తల్లిదండ్రుల వద్ద ఉంటూ విశ్రాంతి తీసుకుంటోంది. ఈ క్రమంలో మంగళవారం ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో తన స్వగ్రామంలోని మోరి గ్రామంలో ఉన్న సుబ్బమ్మ కోవిడ్ స్టెబిలైజేషన్ సెంటర్ లో వైద్య చికిత్స కోసం చేరింది. ఇంతలోనే పరిస్థితి విషమించి మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఎన్నో ఆశలతో వైద్య వృత్తిలోకి అడుగుపెట్టిన యువ వైద్యురాలు మృతి చెందడం వైద్య రంగంలోని వారిని సైతం ఆందోళనకు గురిచేస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో యువ వైద్యురాలి మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.