అన్ని వర్గాల స్టూడెంట్లు ఒకే చోట చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

అన్ని వర్గాల స్టూడెంట్లు ఒకే చోట చదవాలన్నదే ప్రభుత్వ లక్ష్యం  : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  •     స్కూల్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

మధిర, వెలుగు : కుల, మత తేడాలు లేకుండా అన్ని వర్గాల స్టూడెంట్లు ఒకే చోట చదువుకోవాలన్న సంకల్పంతోనే ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను ఏర్పాటు చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. విద్య ద్వారానే సమాజంలో గుర్తింపు, గౌరవం దక్కుతుందన్నారు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురంలోని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను ఆదివారం కలెక్టర్ దివాకర టీఎస్, వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ తో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి కల్లా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణాలు పూర్తి చేసి, అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పనులను మరింత స్పీడ్ గా చేయాలని చెప్పారు. ఆయన వెంట సుడా చైర్మన్ పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఆఫీసర్లు బుగ్గయ్య, శ్రీనివాసాచారి, యుగంధర్ రావు, వెంకట్ రెడ్డి, సీపీఓ శ్రీనివాస్, ఖమ్మం ఆర్డీవో శ్రీనివాస్ ఉన్నారు. అంతకుముందు చింతకానిలోని శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని భట్టి విక్రమార్క సందర్శించారు. ఆయనకు అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గర్భగుడిలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత చింతకాని మండలంలో రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.