యువతీ ..యువకుడు ఆత్మహత్య..ములుగు జిల్లా కర్లపల్లి సమీపంలో ఘటన

యువతీ ..యువకుడు ఆత్మహత్య..ములుగు జిల్లా కర్లపల్లి సమీపంలో ఘటన
  • నెల కింద అదృశ్యం.. ఒకే చెట్టుకు ఉరేసుకున్న జంట

ములుగు (గోవిందరావుపేట), వెలుగు : నెల రోజుల కింద కనిపించకుండా పోయిన యువతీయువకుడు ఒకే చెట్టుకు ఉరి వేసుకొని చనిపోయి కనిపించారు. ఈ ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి సమీపంలోని అడవిలో సోమవారం వెలుగుచూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... 

గోవిందరావుపేట మండలం కర్లపల్లి శివారులోని మామాడితోగు గొత్తికోయగూడేనికి చెందిన కాశపు కోమల (కమలి) (18), కోరం ఇరమయ్య (హిడుమ) (18) నెల రోజుల కింద ఇప్ప పువ్వు కోసమని అడవికి వెళ్లారు. అప్పటి నుంచి తిరిగి గూడేనికి రాలేదు. సోమవారం పశువుల కాపర్లు కర్లపల్లి శివారులోని అడవికి వెళ్లగా.. ఒకే చెట్టుకు ఉరివేసుకున్న యువతీయువకుడి డెడ్‌బాడీలు కనిపించాయి. 

వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అయితే కోమల, ఇరమయ్య ప్రేమకు కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారా ? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా ? అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.