సోమాజిగూడలో మంత్రుల కాన్వాయ్‌‌‌‌పై యువతి ఆగ్రహం

సోమాజిగూడలో మంత్రుల కాన్వాయ్‌‌‌‌పై యువతి ఆగ్రహం

 

  • సైరన్  వేసుకుంటూ వచ్చిన పైలట్‌‌‌‌  వెహికల్
  • వాహనాన్ని అడ్డగించి సిబ్బందిపై విరుచుకుపడ్డ యువతి
  • తమకు కూడా అత్యవసర పనులు ఉన్నాయని ఫైర్
  • మంత్రులు, వీఐపీలకు ఎందుకు దారివ్వాలని నిలదీత

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : మంత్రులు, వీఐపీ ప్రొటోకాల్‌‌‌‌పై ఓ యువతి తీవ్రంగా అసహనం వ్యక్తం చేసింది. ట్రాఫిక్‌‌‌‌ లో తన వెనుకే సైరన్  వేస్తూ వచ్చిన పైలట్‌‌‌‌  వెహికిల్‌‌‌‌ సిబ్బందిపై విరుచుకుపడింది. తన హెల్మెట్‌‌‌‌తో కార్‌‌‌‌‌‌‌‌  బాన్నెట్‌‌‌‌పై బలంగా కొట్టింది. సోమాజిగూడలో శనివారం  జరిగిన ఈ ఘటన ఎస్కార్ట్‌‌‌‌ పోలీసులను హడలిపోయేలా చేసింది. యువతి ధైర్యానికి వాహనదారులు హ్యాట్సాఫ్  చెప్పారు. ఖైరతాబాద్  చౌరస్తా నుంచి ఓ యువతి బంజారా హిల్స్‌‌‌‌ వైపు బైక్‌‌‌‌పై వెళ్తున్నది. ఆమె వెళ్లే రూట్‌‌‌‌లోనే  ఓ కాన్వాయ్‌‌‌‌లోని పైలట్‌‌‌‌ వెహికల్‌‌‌‌ కూడా వెళుతోంది. ఎర్రమంజిల్  చౌరస్తా వద్ద ఎస్కార్ట్‌‌‌‌  సిబ్బంది ఎప్పట్లాగే సైరన్  మోగిస్తూ వాహనం నడుపుతున్నారు. ఈ క్రమంలో యువతి బైక్‌‌‌‌  వెనుక పలుమార్లు సైరన్‌‌‌‌  మోగించారు. అప్పటికే ట్రాఫిక్  జామ్ తో విసిగిపోయిన ఆ యువతి తన బైక్‌‌‌‌  నిలిపింది.పైలట్‌‌‌‌  వెహికల్‌‌‌‌  ముందుకెళ్లి పెద్దగా అరుస్తూ ఎస్కార్ట్‌‌‌‌ పోలీసులపై విరుచుకుపడింది.

‘‘కాన్వాయ్‌‌‌‌లో ఎవరూ లేపోయినా ఎందుకు సైరన్  మోగిస్తున్నారు. ట్రాఫిక్ జామ్‌‌‌‌ అయ్యింది కనిపించడం లేదా? మంత్రులు, వీఐపీలు వెళ్తుంటే మేము ఎందుకు దారివ్వాలి? వాళ్లు పబ్లిక్  కోసమే పనిచేయాలి కదా? సిటీ రోడ్లపై డ్రైనేజీలు పొంగుతున్నా, ఎక్కడికక్కడ ట్రాఫిక్  జామ్‌‌‌‌  అయినా ఎవ్వరూ పట్టించుకోరు కానీ మంత్రులు ట్రావెల్‌‌‌‌ చేసే సమయంలో మాత్రం రూట్‌‌‌‌  క్లియర్  చేయాలి. మంత్రులకే కాదు మాకూ అత్యవసర పనులు ఉంటాయి’’ అని యవతి ఫైర్  అయింది. ఎస్కార్ట్‌‌‌‌  వెహికల్‌‌‌‌లో ఉన్న పోలీసులు యువతిని నివారించలేక తమ మొబైల్‌‌‌‌ ఫోన్‌‌‌‌లో రికార్డు చేశారు. వాహనదారులు కూడా ఈ దృశ్యాన్ని తమ మొబైల్  ఫోన్లలో రికార్డు చేశారు.