నాగర్‌‌ కర్నూల్ జిల్లాలో ప్రేమ పేరుతో దాడి.. రక్షణ కల్పించాలన్న యువతి

నాగర్‌‌ కర్నూల్ జిల్లాలో ప్రేమ పేరుతో దాడి.. రక్షణ కల్పించాలన్న యువతి
  •      పోలీసులను వేడుకున్న దళిత యువతి, కుటుంబ సభ్యులు

నాగర్‌‌కర్నూల్, వెలుగు : ప్రేమ పేరుతో వేధిస్తూ, దాడి చేస్తున్న యువకుడి నుంచి రక్షణ కల్పించాలని ఓ యువతి పోలీసులను కోరింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం కల్వకుర్తిలో తల్లిదండ్రులతో కలిసి మీడియాకు వివరాలు వెల్లడించింది. నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన దళిత బాలిక కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ స్కూల్‌‌లో 2021లో టెన్త్‌‌ పూర్తి చేసింది. అదే స్కూల్‌‌లో చదువుతున్న అహ్మద్‌‌ అనే యువకుడు బాలికతో చనువుగా ఉండేవాడు. టెన్త్‌‌ పూర్తయిన తర్వాత బాలికతో ఫోన్‌‌ కాంటాక్ట్‌‌లోకి వచ్చి ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఇద్దరి మధ్య చనువు పెరిగి, శారీరక సంబంధానికి దారితీసింది. దీన్ని ఆసరాగా చేసుకున్న యువకుడు.. అమ్మాయి చదివే కాలేజీకి వెళ్లేవాడు. అక్కడ మాట్లాడకపోతే భౌతికంగా హింసించేవాడు. 

ఇంటర్‌‌ పూర్తి కాగానే రంగారెడ్డి జిల్లా షాద్‌‌నగర్‌‌లోని ఓ కంపెనీలో పనికి చేరగా.. అక్కడికి సైతం వెళ్లి శారీరకంగా హింసించాడు. యువకుడి ప్రవర్తనపై గతేడాది ఆగస్ట్‌‌లో పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మందలించి వదిలేశారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 12న యువతి తన అమ్మమ్మ ఊరైన ముచ్చర్లపల్లికి వెళ్లగా.. అక్కడికి వెళ్లిన యువకుడు బంధువుల ముందే దాడి చేశాడు. తర్వాత యువతి ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్‌‌ వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఊర్కొండ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మిస్సింగ్‌‌ కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు... ఆమె శరీరంపై ఉన్న దెబ్బలు, అమ్మాయి స్థితిని రికార్డు చేశారు. 

తనను కలవకపోతే... ఫొటోలు, వీడియోలు బయటపెడుతానని బెదిరించేవాడని, ఈ విషయాలపై ఈ నెల 15న కల్వకుర్తి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సదరు యువకుడికి ఓ కౌన్సిలర్‌‌ భర్త, మరో కౌన్సిలర్‌‌ అండగా ఉన్నారని ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని యువతి, తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయంపై కల్వకుర్తి డీఎస్పీ వెంకట్‌‌రెడ్డి వివరణ ఇస్తూ... యువతి ఫిర్యాదు స్టేట్‌‌మెంట్‌‌ను రికార్డు చేసి విచారణ ప్రారంభించామన్నారు. విషయాలు బయటకు పొక్కి, కేసు నీరుగారిపోకుండా రహస్యంగా విచారణ చేస్తున్నామన్నారు. యువకుడికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకున్న తర్వాత చర్యలను వెల్లడిస్తామని చెప్పారు.