మీ పాపకు హీరోయిన్ రష్మికతో కలిసి యాడ్స్​లో నటించే చాన్స్!

మీ పాపకు హీరోయిన్ రష్మికతో కలిసి యాడ్స్​లో నటించే చాన్స్!
  • ఆడిషన్స్​లో సెలక్ట్ అయ్యారని చెప్పి కాస్ట్యూమ్ డిజైనింగ్ పేరుతో డబ్బులు వసూలు
  • ఇద్దరు అరెస్ట్.. రూ.15 లక్షల 60 వేల క్యాష్ సీజ్

‘సిటీలోని  పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్​లో ర్యాంప్​వాక్​లు ఏర్పాటు చేస్తరు. అక్కడికి వచ్చే చిన్నారులను అట్రాక్ట్ చేసి యాడ్స్, మోడలింగ్​లో చాన్స్ ఇప్పిస్తామంటూ నమ్మిస్తరు. తర్వాత కాంటాక్ట్ నంబర్లను సేకరించి వాట్సాప్​లో చిన్నారుల తల్లిదండ్రులతో ఇంట్రాక్ట్ అవుతారు. మీ పిల్లలను  ఆడిషన్లకు తీసుకురావాలని వారికి చెబుతారు. హీరోయిన్ రష్మిక మందన్నతో మీ పిల్లలు యాడ్స్​లో నటించే చాన్స్ కొట్టేసారని  చెప్పి.. మోడలింగ్ వెబ్ సైట్​లో చూపిస్తరు.  కాస్ట్యూమ్స్ డిజైనింగ్ కోసం డబ్బులు కావాలని ఆన్ లైన్​లో ట్రాన్స్​ఫర్ చేయించుకుంటరు.  కాస్మోపాలిటన్ మోడల్ ఏజెన్సీ పేరుతో ఫేక్ వెబ్ సైట్ రన్ చేస్తున్న మోడల్​తో పాటు అతడి భార్యను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.   

గచ్చిబౌలి, వెలుగు:  చిన్నారులకు యాడ్స్, మోడలింగ్​లో అవకాశం కల్పిస్తామంటూ మోసం చేస్తున్న  ఇద్దరిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.  సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మదీనాగూడకు చెందిన  గోపాలకృష్ణన్ కృష్ణానంద్​ గతేడాది డిసెంబర్​లో తన కూతురి బర్త్ డే సందర్భంగా ఫ్యామిలీతో కలిసి గచ్చిబౌలి లోని శరత్ సిటీ మాల్​కు వెళ్లాడు. అదే టైమ్​లో కాస్మోపాలిటన్ మోడల్ ఏజెన్సీ నిర్వాహకులు అక్కడ ర్యాంప్ వాక్ నిర్వహించారు. మాల్​కు వచ్చిన చిన్నారుల్లో కొందరిని సెలక్ట్ చేసి వారితో ర్యాంప్ వాక్ చేయించారు. మోడలింగ్, యాడ్స్ లో ఇంట్రెస్ట్ ఉందా అని కృష్ణానంద్ కుమార్తెను నిర్వాహకులు అడగగా.. ఆ చిన్నారి ఓకే చెప్పింది. దీంతో ఏజెన్సీ నిర్వాహకులు కృష్ణానంద్ కాంటాక్ట్ నంబర్ తీసుకుని వాట్సాప్​లో  కూపన్ కోడ్ పంపించారు.  మీ కూతురి ఫొటోలు పంపించాలని కోరగా.. కృష్ణానంద్​ వాట్సాప్​లో సెండ్ చేశాడు. తర్వాత మేఘన అనే యువతి కృష్ణానంద్​కు కాల్ చేసి.. దేశంలోని వివిధ సిటీల నుంచి 20 మంది చైల్డ్ మోడల్స్​ను ఫ్యాషన్ షోస్, అడ్వర్టైజ్ మెంట్స్ కోసం సెలక్ట్ చేశామని.. డిసెంబర్ 17న అదే మాల్​లో ఫైనల్ ఆడిషన్ ఉంటుందని చెప్పింది. అమ్మాయిని రెడ్ డ్రెస్​లో తీసుకురావాలని తెలిపింది. కృష్ణానంద్ 17న తన కూతురిని తీసుకుని మాల్​కు వెళ్లాడు. అక్కడ చిన్నారి ర్యాంప్ వాక్ చేయగా.. అదే రోజు రాత్రి మీ కుమార్తె మోడలింగ్​కు సెలక్ట్ అయ్యిందని నిర్వాహకులు వాట్సాప్ మెసేజ్ పంపించారు.  ఆ తర్వాత కృష్ణానంద్​కు మేఘన ఫోన్ చేసి తన హెడ్​ డాక్టర్ అమిత్ ​మీకు వాట్సాప్ కాల్ చేస్తారని చెప్పింది. డిసెంబర్​ 20న అమిత్ పేరుతో ఓ వ్యక్తి కృష్ణానంద్​కు కాల్ చేశాడు. మీ కుమార్తె ఓరియో బిస్కెట్ నేషనల్ యాడ్​కు సెలక్ట్ అయ్యిందని.. హీరోయిన్ రష్మిక మందన్నాతో కలిసి యాక్ట్ చేయనుందని చెప్పాడు. ఈ యాడ్ కాస్ట్యూమ్స్ కోసం డిజైనర్ రీతుకుమార్​కు రూ.3 లక్షల 25 వేలు డిపాజిట్ చేయాలన్నాడు. ఇది నమ్మిన కృష్ణానంద్ అతడు చెప్పిన విధంగా వివిధ బ్యాంక్ అకౌంట్లకు విడతల వారీగా రూ. 14 లక్షల 12 వేలు పంపించాడు. యాడ్స్, మోడలింగ్ పేరుతో ఫేక్ వెబ్​సైట్​తో కాస్మోపాలిటన్ మోడల్ ఏజెన్సీ నిర్వాహకులు మోసం చేసినట్లు గుర్తించిన కృష్ణానంద్ ఈ నెల 4న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేశాడు. పోలీసులు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.

విదేశాల్లో చదువులు.. ఇక్కడ మోసాలు..

పుణెలోని రాంనగర్  కాలనీకి చెందిన అపూర్వ అశ్విన్ అలియాస్ అర్జున్ కపూర్(47) యూఎస్​లోని యూనివర్సిటీ ఆఫ్​ కాలిఫోర్నియాలో 1998లో మార్కెటింగ్​లో ఎంఎస్ చేశాడు. తర్వాత ఇండియాకు వచ్చి మోడలింగ్, డైరెక్షన్, యాక్టింగ్ వైపు వెళ్లాడు. 20 ఏండ్లుగా మోడలిం
గ్​లో ఉన్నాడు.  బాలీవుడ్ మూవీస్ రెండింటిలో యాక్ట్ చేశాడు. తర్వాత జల్సాలకు బానిసయ్యాడు. చిన్నారులతో మోడలింగ్, ఫ్యాషన్ షో నిర్వహిస్తే  పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించవచ్చిన స్కెచ్ వేశాడు. తర్వాత చిన్నారులకు మోడలింగ్, యాడ్స్​లో నటించే చాన్స్ ఇప్పిస్తానంటూ వారి తల్లిదండ్రులను మోసం చేసి డబ్బులు వసూలు చేయడం మొదలుపెట్టాడు. గతంలో ముంబయి పోలీసులు అపూర్వను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత తన పేరును అశ్విన్ నుంచి అర్జున్ కపూర్​గా 
మార్చుకున్నాడు. ముంబయికి చెందిన నజీశ్ మీమన్ అలియాస్ నటాషా కపూర్(26) పెండ్లి చేసుకున్నాడు. తనతో పాటు మోడలింగ్​లో పనిచేసేందుకు ఆమె పేరును సైతం మార్చేశాడు.

బడా షాపింగ్ మాల్స్ టార్గెట్​గా..

అపూర్వ అశ్విన్​ మోడలింగ్​ ఏజెన్సీ పేరుతో వెబ్ సైట్​ను క్రియేట్ చేసి మెట్రో సిటీస్​లోని బడా షాపింగ్ మాల్స్​కు వెళ్లేవాడు.  మాల్స్​ మేనేజర్లతో వాట్సాప్​, మెసెంజర్లలో కాంటాక్ట్​ అయ్యేవాడు. మాల్స్​లో చిల్డ్రన్​ ర్యాంప్​ వాక్​ నిర్వహించేందుకు పర్మిషన్​ తీసుకునేవాడు. ఆ తర్వాత  ఇండెడ్​. కామ్​ వెబ్​సైట్​లో ఫ్యాషన్​ డిజైన్​ కోర్సు చేసి ఉద్యోగం కోసం చూస్తున్న వారిని సెలక్ట్​ చేసేవాడు. 
మాల్స్​లో ర్యాంప్​ వాక్​ నిర్వహిస్తే మంచి శాలరీ ఇస్తానని చెప్పేవాడు. ఇతడి దగ్గర చేరిన వారు మాల్స్​కు వచ్చే పిల్లలను టార్గెట్ చేసి వారితో ర్యాంప్​వాక్ చేయించేవారు. తర్వాత సినిమా హీరోలు, క్రికెటర్లతో కలిసి యాడ్స్​లో, మోడలింగ్​లో యాక్ట్ చేసే​ అవకాశం కల్పిస్తామని పిల్లల తల్లిదండ్రులకు చెప్పేవారు. ఈ ఫ్రాడ్​లో మేఘన పేరుతో  నటాషా కపూర్ చిన్నారుల తల్లిదండ్రులతో ఫోన్​లో మాట్లాడేది. తర్వాత అమిత్ పేరుతో అపూర్వ​ను పరిచయం చేసేది. ప్యాకేజీ, కాస్ట్యూమ్స్, మేకప్ కిట్స్ చార్జీల పేరుతో చిన్నారుల తల్లిదండ్రుల నుంచి  అపూర్వ పెద్దఎత్తున అకౌంట్లలో డబ్బును డిపాజిట్​చేయించుకునేవాడు. రాజస్థాన్​లోని జైపూర్, అజ్మీర్ సిటీల్లో షాప్ ఓనర్లకు చెందిన బ్యాంక్ అకౌంట్లను వారికి కమీషన్ ఇచ్చి అపూర్వ తీసుకునేవాడు. అందులోనే చిన్నారుల తల్లిదండ్రులతో డబ్బు డిపాజిట్ చేయించేవాడు. ఆ  తర్వాత తన మొబైల్​ను స్విచాఫ్ చేసేవాడు. బాధితుల కంప్లయింట్లతో కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సోమవారం అపూర్వ అశ్విన్, నటాషా కపూర్ ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.15 లక్షల 60 వేల క్యాష్​, 4 ఐఫోన్లు, ల్యాప్ టాప్, ఆధార్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు.  అపూర్వపై సైబరాబాద్ పరిధిలో 4  , బెంగళూరులో ఓ కేసు ఉందని పోలీసులు తెలిపారు.

బాచుపల్లిలోనూ కేసు..

జీడిమెట్ల: ప్రగతినగర్​కు చెందిన అరుణ్​కుమార్ (28) ప్రైవేటు జాబ్ చేస్తున్నాడు. తన ఫ్యామిలీతో కలిసి  గతేడాది డిసెంబర్ 18న గచ్చిబౌలిలోని శరత్​ సిటీ క్యాపిటల్​ మాల్​కు వెళ్లాడు. అక్కడ చిన్నారుల ర్యాంప్ వాక్​ను చూసిన అరుణ్ తన బాబును సైతం అందులో పార్టిసిపేట్ చేయించాడు. ఫొటోలు తీయించాడు. నిర్వాహకులు వాట్సాప్ ద్వారా అరుణ్​తో కాంటాక్ట్ అయ్యి ఫైనల్​ ఆడిషన్లకి  బాబును తీసుకుని రావాలని చెప్పారు. అరుణ్ తన కొడుకుని ఆడిషన్స్​కు తీసుకెళ్లాడు. ‘మీ బాబుకు యాడ్స్ లో నటించే చాన్స్ వచ్చింది’ అంటూ నిర్వాహకులు అరుణ్​తో చెప్పి మెంబర్ షిప్, జీఎస్టీ పేరుతో డిసెంబర్ 25న రూ.44,800 వేలు వసూలు చేశారు. తర్వాత బాలీవుడ్ డిజైనర్​తో కాస్ట్యూమ్స్ డిజైనింగ్ చేయిస్తామని.. ఇందుకోసం రూ.3 లక్షల 25 వేలు చెల్లించాలన్నారు. మోసపోయినట్లు గుర్తించిన అరుణ్ ఈ నెల 20న బాచుపల్లి పోలీసులకు కంప్లయింట్ చేశాడు.