గల్ఫ్ ఏజెంట్ల క్రెడిట్ దందా..ఈజీ మనీ ఆశ చూపి నిరుద్యోగులకు ఎర

గల్ఫ్ ఏజెంట్ల  క్రెడిట్ దందా..ఈజీ మనీ ఆశ చూపి నిరుద్యోగులకు ఎర
  • ఈజీ మనీ ఆశ చూపి నిరుద్యోగులకు ఎర
  • క్రెడిట్ కార్డు పై రూ.40 లక్షల వరకు లోన్స్. 
  • లోన్స్ ఎగవేతకు కారణమవుతున్న ఏజెంట్లు
  • లోన్స్ రాని వారిని గల్ఫ్ లో వదిలించుకున్న వైనం

జగిత్యాల, వెలుగు : ఉన్న ఊళ్లో ఉపాధి లేక గల్ఫ్ బాట పట్టిన వలస కార్మికులను మోసం చేసేందుకు ఏజెంట్లు 'క్రెడిట్'  కార్డు రూపంలో నయా దందాకు తెర లేపారు.  గల్ఫ్ కార్మికులతో పాటు స్వదేశంలో ఉన్న యువకులను, నిరుద్యోగులను ట్రాప్ చేసి మరీ క్రెడిట్ కార్డుల పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. ఇక్కడి ఏజెంట్లతో కుమ్మక్కైన కొందరు గల్ఫ్ లో బ్యాంకు లోన్స్ ఇప్పించి మూడు వంతుల కమీషన్ వసూల్ చేస్తూ ఆర్థికంగా దెబ్బ తీస్తున్నారు.  లోన్స్ అప్రూవల్  కాని కార్మికులకు వదిలించుకుంటున్నారు. దీంతో ఆర్థికంగా చితికిపోతే, మరికొందరు తిరిగి స్వదేశానికి వచ్చి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలపై పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.

లక్షలు ఆశ చూపి..  

గతంలో విజిట్ వీసాలు, నకిలీ కంపెనీల పేరిట వీసాలు అంటగట్టి అక్రమంగా సంపాదించిన  గల్ఫ్ ఏజెంట్లు ఇప్పుడు మరో అక్రమ దందాకు తెర లేపారు.  లక్షల్లో ఈజీ మనీ వస్తుందని ఆశ చూపి నిరుద్యోగులను ఆజాద్ వీసాలపై  గల్ఫ్ దేశాలకు పంపిస్తున్నారు. ముందుగా డీల్ చేసుకున్న ప్రకారం అక్కడి ఏజెంట్లు ఒకటి,రెండు నెలలు షెల్టర్ ఇస్తూ అక్కడి బ్యాంకుల్లో ఫేక్ డాక్యుమెంట్స్ తో క్రెడిట్ కార్డులు ఇప్పిస్తున్నారు. ఈ కార్డులతో లోన్ ఇప్పిస్తున్న అక్కడి ఏజెంట్లు నామమాత్రంగా నిరుద్యోగులకు డబ్బులు ఇచ్చి రిటర్న్ పంపిస్తున్నారు. దీంతో మరోసారి గల్ఫ్ వెళ్లకుండా వీరిపై ఆయా దేశాలు నిషేధం విధిస్తున్నాయి. అలాగే లోన్ అప్రూవల్ రాని వలస కార్మికులను వదిలించుకోవడంతో  తిండి, నీడ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గల్ఫ్ కార్మిక సంఘాలు, ఎన్ఆర్ఐల సాయంతో తిరిగి ఇండియాకు వస్తుంటే కొందరు జైళ్లపాలవుతున్నారు. 

ఆజాద్ వీసాతో మోసాలు..

ఆజాద్ వీసాకు సుమారు రెండేళ్ల గడువు తో కంపెనీల ఏర్పాటుకు వీలు ఉంటుంది.  ఏలాంటి వర్క్ చేసుకునేందుకైనా ప్రత్యేకంగా పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీంతో కొందరు మోసగాళ్లు యువకులను, నిరుద్యోగులకు ఆజాద్ వీసా ఇప్పించి ఓ ఫేక్ కంపెనీ లో మేనేజర్, అసిస్టెంట్  మేనేజర్ స్థాయి పోస్టులను క్రియేట్ చేస్తున్నారు.  బ్యాంకర్లను నమ్మించేందుకు ప్రతి నెలా సాలరీ కూడా వేస్తున్నారు. ఆయా బ్యాంకుల్లో ముందుగానే తీసుకున్న అకౌంట్లకు చెందిన క్రెడిట్ కార్డుల ద్వారా సుమారు 1.80 లక్షల ధరమ్స్ (రూ. 40 లక్షలు) వరకు లోన్స్ తీసుకుంటున్నారు. పాస్ పోర్టులు, క్రెడిట్ కార్డులు తమ ఆధీనం లో పెట్టుకుంటున్నారు. లోన్ శాంక్షన్ అయ్యాక రూ. 40 లక్షలకు గాను సుమారు రూ. 7- నుంచి 10 లక్షలు ఇచ్చి ఒక్క ఈఎంఐ కట్టకుండానే ఇండియాకు పంపిస్తున్నారు. ఈ దందాకు ఆరు నెలల వరకు సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. 

గల్ఫ్ లో క్రెడిట్ కార్డు బాధితులు

మూడు నెలల క్రితం మల్యాల మండలం లోని ఓ గ్రామానికి చెందిన కారోబార్ ఏజెంట్ ద్వారా విజిట్ వీసా పై దుబాయి వెళ్లాడు. బ్యాంక్ అకౌంట్ తీసి క్రెడిట్ కార్డు ద్వారా లోన్ తీసుకోవాలని ప్లాన్ వేశారు. కానీ  సరైన డాక్యుమెంట్స్ లేకపోవడంతో ప్లాన్ బెడిసి కొట్టడంతో తిరిగి స్వగ్రామానికి పంపించేశారు.   

గత నెలలో సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఈజీ మనీ కోసం విజిట్ వీసాపై దుబాయి వెళ్లాడు. అక్కడ క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న అమౌంట్ లో ఇవ్వాల్సిన కమీషన్ కూడా ఇవ్వకుండా తిరిగి పంపించడం తో స్వగ్రామానికి చేరకున్నాడు. ఆర్థికంగా చితికి పోయి అప్పులపాలు కావడంతో ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు  చికిత్స అందించడం తో ప్రాణాలతో బతికి బయటపడ్డాడు.  

జగిత్యాల పట్టణానికి చెందిన ఇద్దరు యువకులు క్రెడిట్ కార్డు ద్వారా లోన్ తీసుకుని ఈజీ మనీ సంపాదించవచ్చని  దుబాయికి వెళ్లారు. తీరా అక్కడికి వెళ్లిన యువకులకు లోన్ మంజూరు కాకపోవడంతో  వారిన ఏజెంట్ రోడ్డు పై వదిలేశాడు.  స్వదేశానికి వచ్చేందుకు చిల్లిగవ్వ లేక పోవడం తో తమను రక్షించాలని మినిస్టర్ కేటీఆర్ ను ట్విట్టర్ లో వేడుకున్నారు.

ఈజీ మనీ కోసం మోసపోవద్దు  

కొందరు నిరుద్యోగులు ఈజీ మనీ వ్యామోహంలో గల్ఫ్​ కంట్రిల్లో క్రెడిట్ కార్డు మోసానికి గురవుతున్నారు.  అక్రమార్కులు ఏజెంట్ల ముసుగు లో ముఠాలుగా ఏర్పడి అమాయకులకు ఎర వేస్తున్నారు. బ్యాంక్ అకౌంట్ కు పాస్ పోర్టు అనుసంధానం ఉండటంతో బ్యాంకర్లు స్వదేశం లోనూ వసూల్ చేసే అవకాశాలు ఉన్నాయి. పాస్ పోర్టు సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.  పూర్తి స్థాయి అవగాహన కల్పిస్తే ఇలాంటి ఘటనలు పునరావృతం కావు. 

- సింగిరెడ్డి నరేశ్​ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ జేఏసీ కన్వీనర్, జగిత్యాల జిల్లా