
- మంచిర్యాలలో అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం ఇచ్చేందుకు యత్నం
మంచిర్యాల, వెలుగు: పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను సరస్వతి పుష్కరాలకు ఆహ్వానించకుండా అవమానించడంపై యూత్ కాంగ్రెస్ లీడర్లు, సోషల్ మీడియా కార్యకర్తలు మంగళవారం మంచిర్యాలలో నిరసన చేపట్టారు. ఐబీ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి మెమోరాండం ఇచ్చేందుకు వెళ్లగా, కొంతమంది అడ్డుకున్నారు. తాము పోలీసుల పర్మిషన్ తీసుకున్నామని, శాంతియుతంగా నిరసన తెలుపుతామని చెప్పినా వినకుండా దాడికి యత్నించారు.
అప్పటికే అక్కడికి చేరుకున్న మంచిర్యాల ఏసీపీ ప్రకాశ్, సీఐలు, ఎస్సైలు.. ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించారు. అనంతరం యూత్ కాంగ్రెస్ లీడర్లు రాయబారపు కిరణ్, ఆసంపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ.. సరస్వతి పుష్కరాల్లో ప్రోటోకాల్ పాటించకుండా ఎంపీ వంశీకృష్ణను అవమానించడం తగదన్నారు. ఎంపీని ఆహ్వానించలేదని, కనీసం ఫ్లెక్సీల్లో ఫొటో కూడా పెట్టలేదన్నారు. దళితుడు కావడంతోనే అవమానిస్తున్నారని, దీనిని దళిత జాతికి జరిగిన అవమానంగానే భావించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు సృజన్, పున్నం, మాయ తిరుపతి, దాసరి సంపత్, శ్రీశైలం, అరుణ్ గాదే, రాజేశ్, రాకేశ్, వెంకటేశ్, రాజన్న తదితరులు పాల్గొన్నారు.