దహెగాం మండలంలో ప్రాణం తీసిన పాట

దహెగాం మండలంలో  ప్రాణం తీసిన పాట

దహెగాం, వెలుగు : ఓ యువకుడు సరదాగా పాడిన పాట ప్రాణం మీదకు తెచ్చింది. తననే చూసి పాడుతున్నాడని ఓ యువతి కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారంతా కలిసి దాడి చేయడంతో యువకుడు చనిపోయాడు. ఈ ఘటన ఆసిఫాబాద్‌ మండలం దహెగాం మండలంలో శనివారం జరిగింది. దహెగాం ఎస్సై రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మొట్లగూడ గ్రామానికి చెందిన గోమస భాగ్య, ఆమె తమ్ముడు వగాడి ఆనంద్‌రావు(24)కుటుంబానికి అదే గ్రామానికి చెందిన దుర్గం శంకర్‌, వినోద్‌, మనోజ్‌ కుటుంబాలతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో శనివారం ఉదయం ఆనంద్‌రావు పాట పాడుకుంటూ రోడ్డుపై వెళ్లాడు. అయితే తనను ఉద్దేశించే పాడుతున్నాడని భావించిన దుర్గం శిరీష విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో దుర్గం వినోద్, మనోజ్, దిలీప్, శంకర్, గిరిజ, చిన్నక్క, శిరీష కలిసి కత్తులు, కర్రలు, రాళ్లతో ఆనంద్‌రావుపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ అతడు అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ వహీరుద్దీన్‌, సీఐ కుమారస్వామి  ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడి అక్క భాగ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.