
పొగాకు ప్రాణాంతకం.. అని అందరికీ తెలుసు. అలాగని సిగరెట్లు తాగకుండా, గుట్కాలు తినకుండా ఉంటున్నారా..? ప్రభుత్వాలతోపాటు స్వచ్ఛంద సంస్థలు అవగాహన కల్పిస్తున్నా పొగాకు వాడకం పెరుగుతూనే ఉంది. దానికి కారణం.. మార్కెటింగ్ స్ట్రాటజీ. ముఖ్యంగా యూత్‌ని అట్రాక్ట్ చేయడానికి రకరకాల మార్గాల్లో వాటిని మార్కెట్ చేస్తుంటారు. అందుకే ఈ నెల 31న నిర్వహించే ‘వరల్డ్ నో టొబాకో డే’ సందర్భంగా ‘అన్మాస్కింగ్ ది అప్పీల్’ అనే థీమ్‌ని ఎంపిక చేసింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని ద్వారా తప్పుదారి పట్టించే టొబాకో మార్కెటింగ్ స్ట్రాటజీలపై అవగాహన కల్పిస్తుంది.
ప్రభాత్, వినీత్‌లు డిగ్రీ సెకండియిర్ చదువుతున్నారు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ప్రభాత్కి సిగరెట్ తాగే అలవాటు ఉంది. కానీ.. వినీత్ మాత్రం ఎప్పుడూ ముట్టుకోలేదు. ఒకసారి వినీత్‌కి జలుబు చేసింది. నాలుగైదు రోజులపాటు బాగా ఇబ్బందిపడ్డాడు. అప్పుడతనికి మింట్ఫ్లేవర్డ్ సిగరెట్ తాగితే వెంటనే జలుబు తగ్గిపోతుందని సలహా ఇచ్చాడు ప్రభాత్. కానీ.. వినీత్ పట్టించుకోలేదు. ‘ఒక్కసారి ప్రయత్నించడం వల్ల జరిగే నష్టం ఏం లేదు కదా!’ అని పదేపదే చెప్పడంతో వినీత్ ఆ సిగరెట్ ట్రై చేశాడు. జలుబు తగ్గిందా? లేదా? అనేది పక్కన పెడితే సిగరెట్అలవాటు మాత్రం అంటుకుంది. వినీత్ మాత్రమే కాదు.. చాలామంది వాళ్ల జీవితాల్లో సిగరెట్‌ని ఇలా ఫ్రెండ్స్చెప్పడం వల్లే అలవాటు చేసుకుంటారు. ఆ తర్వాత జీవితాంతం దాన్ని వదిలించుకోలేక ఇబ్బంది పడతారు.
టీవీ చూస్తున్నప్పుడు నవీన్‌కు పదే పదే ఓ పాన్ మసాలా యాడ్ కనిపించింది. ఒకసారి అతను కూడా దాన్ని ట్రై చేయాలి అనుకున్నాడు. ఒక షాప్ దగ్గరకు వెళ్లి ఆ పాన్‌మసాలా పేరు చెప్పి ఇవ్వమని అడిగాడు. ఆ పక్కనే ఉన్న ఓ వ్యక్తి అందులో టొబాకో కలిపి తింటే బాగుంటుందని సలహా ఇచ్చాడు. అప్పుడు మొదలైన టొబాకో ఎప్పుడూ అతని నోట్లో ఉంటోంది.
యువతపై ప్రభావం
ఈ మధ్య కాలంలో యువతలో ఈ వ్యసనం పెరుగుతోంది. నచ్చిన సెలబ్రిటీ సిగరెట్ తాగితే.. అది చూసి సిగరెట్ అలవాటు చేసుకునేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. పైగా సోషల్ మీడియా వల్ల యువకులు టొబాకో ప్రొడక్ట్స్‌కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు. ఇది వాళ్ల ఆరోగ్యంతోపాటు భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపిస్తోంది. యువత ఈ వ్యసనం నుంచి బయటపడటానికి ప్రభుత్వాలు, సమాజం, తల్లిదండ్రులు కలిసి పనిచేయాలి. ప్రపంచవ్యాప్తంగా 13–15 సంవత్సరాల వయసు ఉన్న సుమారు మూడున్నర కోట్ల మంది పిల్లలు ఏదో ఒక రకంగా పొగాకు తీసుకుంటున్నారు. ఈ–సిగరెట్లు, నికోటిన్ పౌచ్‌లు, హీటెడ్ టొబాకో ఉత్పత్తుల మార్కెటింగ్ కంటెంట్‌కు సోషల్ మీడియాలో కొన్ని కోట్ల వ్యూస్ ఉన్నట్టు స్టడీల్లో తేలింది.
తప్పుదారి పట్టించేలా..
తమ ఉత్పత్తులు తక్కువ హానికరం లేదా సంప్రదాయ సిగరెట్లకు ప్రత్యామ్నాయం అని ఎన్నో కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌ని మార్కెట్ చేసుకుంటున్నాయి. కొందరు ఈ–సిగరెట్లు, వేప్ పెన్‌లను సేఫ్ ఆల్టర్నేట్స్ అని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. కొన్ని కంపెనీలు రకరకాల ఆకట్టుకునే పేర్లతో ప్రొడక్ట్స్ తీసుకొచ్చి కొత్త వినియోగదారులను క్రియేట్ చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు టొబాకో ప్రొడక్ట్స్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 16,000 రకాల ప్రత్యేక ఫ్లేవర్లు అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో మాత్రం చాలా రకాల ఫ్లేవర్స్‌ని బ్యాన్ చేశారు.
కొందరు సిగరెట్ తాగడమనేది ఒక స్టేటస్‌గా, ఫ్యాషన్ సిగ్నల్‌గా ప్రమోట్ చేస్తుంటారు. దీనివల్ల కాలేజీ స్టూడెంట్స్ స్మోకింగ్ వలలో పడుతున్నారు. ఈ–సిగరెట్లు కూడా యువతను ఎట్రాక్ట్ చేయడానికి వచ్చినవే. కానీ.. వాటిని కూడా మన దేశంలో బ్యాన్ చేశారు. దాంతో ఇప్పుడు కొత్తరకం హీటెడ్ టొబాకో ప్రొడక్ట్స్‌తో ఆకట్టుకుంటున్నారు. కానీ.. టొబాకో ఏ రూపంలో తీసుకున్నా హాని తప్పదని అందులో హాని కలిగించే రసాయనాలు ఉంటాయని అధ్యయనాలు చెప్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ప్రకారం పొగాకు వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 80 లక్షల మంది చనిపోతున్నారు. వీరిలో 13 లక్షల మంది అసలు టొబాకో అలవాటు లేనివాళ్లే. ఇతరులు సిగరెట్ తాగి వదిలిన గాలిని పీల్చడం వల్లే ఎంతోమంది చనిపోతున్నారు.
ఏం చేయాలంటే..
మార్కెటింగ్ వ్యూహాలను ఎదుర్కోవాలంటే ఇలాంటి కొన్ని జాగ్రత్తలు పాటించాలని డబ్ల్యూహెచ్‌వో చెప్తోంది. ప్రొడక్ట్స్ డిజైన్ మీద ప్రభుత్వాలకు పూర్తి నియంత్రణ ఉండాలి. మన దగ్గర ఇప్పటికే టొబాకో ప్రొడక్ట్స్ యాడ్స్ మీద నిషేధం ఉంది. అయినా ఏదో రకంగా వాటి గురించి సోషల్ మీడియాలో సర్క్యులేట్అవుతోంది. కాబట్టి ఏ రకంగానూ ప్రమోట్ చేయకుండా కఠిన నిబంధనలు విధించాలి. ఫ్లేవర్లను పూర్తిగా నిషేధించాలి. దానివల్ల ప్రొడక్ట్ మీద అట్రాక్షన్ తగ్గుతుంది. యువతను ఆకర్షించేలా ప్యాకేజింగ్ చేయకుండా కొత్త రూల్స్ తీసుకురావాలి.
వెంటనే మానేయాలి
టొబాకోని ఏ రకంగా తీసుకున్నా అది బాడీతోపాటు డీఎన్ఏ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకే ఎంత ఎక్కువగా స్మోకింగ్ చేస్తే.. లైఫ్ స్పాన్ అంత ఎక్కువగా తగ్గుతుంది. అందుకే చిన్న వయసులో మొదలుపెట్టినవాళ్లు ఆ అలవాటుని వెంటనే మానేయాలి. ఎందుకంటే.. వాళ్లు జీవితంలో ఎక్కువ రోజులు స్మోకింగ్ చేస్తారు. కాబట్టి దాని ఎఫెక్ట్ కూడా ఎక్కువగానే ఉంటుంది. స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ రావడమే కాదు.. బాడీలో దాదాపు అన్ని పార్ట్స్ మీద దాని ప్రభావం చూపిస్తుంది. అందుకే మన దేశంలో దీనివల్ల ప్రతి ఏటా లక్షల మంది చనిపోతున్నారు. స్మోకింగ్ మానేసినా దాని ఎఫెక్ట్ పూర్తిగా తగ్గదు.
ఎందుకంటే స్మోకింగ్ ఏజింగ్ ప్రాసెస్‌ని స్పీడప్ చేస్తుంది. దాంతో లంగ్ ఏజ్ కూడా పెరిగి దాని పనితనం తగ్గుతుంది. సిగరెట్ తాగితే ముందుగా ఎఫెక్ట్ అయ్యేది ఊపిరితిత్తులే. ఆ తర్వాత ఓరల్ క్యాన్సర్స్, బ్రెయిన్, హార్ట్ స్ట్రోక్స్, బ్లైండ్నెస్, ఫెర్టిలిటీ సమస్యలు, చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనివల్ల ఎముకలు బలహీనపడి కొందరిలో ఫ్యాక్చర్స్ అవుతుంటాయి. కాబట్టి ముఖ్యంగా యూత్ డిజిటల్ మార్కెటింగ్ మాయలో పడి స్మోకింగ్, గుట్కా లాంటివి తినడం మొదలుపెడితే మీ జీవితాలను చేతులారా నాశనం చేసుకున్నట్టే. హుక్కా, ఈ-సిగరెట్స్ లాంటివి వాడే కల్చర్ సిటీల్లో విపరీతంగా పెరిగింది.
దానివల్ల వాళ్లతోపాటు వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి అలవాటు ఉన్నవాళ్లు మానేయాలనే ధృడమైన సంకల్పం తీసుకోవాలి. కొందరు ఏదో ఒకటి చేసి మానేసినా రకరకాల సమస్యలు వస్తున్నాయని చెప్తుంటారు. ముఖ్యంగా మోషన్ సరిగ్గా కావడం లేదని, గాబరా గాబరాగా ఉంటుందని అంటుంటారు. దాంతో మళ్లీ మొదలుపెడుతుంటారు. అలాంటప్పుడు డాక్టర్‌ని సంప్రదించి.. ఆ సింప్టమ్స్‌ని తగ్గించేందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి.
-డాక్టర్టి. వివేక్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మొనాలజిస్ట్, రెనొవా సెంచరీ హాస్పిటల్స్, హైదరాబాద్