జిబ్లీ, నానో బనానా ట్రెండ్‌‌లతో.. మెంటల్ హెల్త్‌‌కు ముప్పు

జిబ్లీ, నానో బనానా ట్రెండ్‌‌లతో.. మెంటల్ హెల్త్‌‌కు ముప్పు
  • ఫొటోలు, వీడియోల క్రియేషన్ కోసం గంటల తరబడి ఫోన్లలో గడుపుతున్న యువత
  • లైక్స్, కామెంట్లతో వచ్చే తాత్కాలిక ఆనందం కోసం డిజిటల్ జంక్ ఫుడ్​కు అలవాటు
  • డోపమైన్ ట్రాప్​లో పడి ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నట్లు గుర్తించిన సైకాలజిస్టులు 
  • చాట్ జీపీటీ, నానో బనానా వంటి ట్రెండ్‌లకు దూరంగా ఉండాలని హెచ్చరిక

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో ఇటీవల నానో బనానా ఎడిట్‌‌లు, జెమినీ మూడ్‌‌బోర్డ్‌‌లు, జిబ్లీ ఫొటోల ట్రెండ్స్ పెరిగిపోయాయి. అయితే, ఈ కొత్త వైరల్ ట్రెండ్‌‌లు యువతను గంటల తరబడి ఫోన్లలో మునిగేలా చేస్తూ  ప్రమాదంలో నెట్టేస్తున్నాయి. తమ ఫోటోలను యానిమేషన్ క్యారెక్టర్‌‌లుగా మార్చుకుని.. తాత్కాలిక ఆనందం కోసం డిజిటల్ జంక్ ఫుడ్ కు అలవాటు పడిపోతూ మానసిక అనారోగ్యానికి గురవుతున్నారు. సోషల్ మీడియాలో  లైక్‌‌లు, కామెంట్‌‌ల మాయలో పడి మనసిక ఆరోగ్యంతోపాటు విలువైన సమయాన్ని కోల్పుతున్నారు.  

ఈ ట్రెండ్‌‌ల వల్ల  దేశ ప్రజల్లో ఒత్తిడి, ఆందోళన, ఒంటరితనం ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయని సైకాలజిస్టులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యంపై సలహాల కోసం థెరపిస్ట్‌‌కు ఫోన్ చేయడానికి ఐదు నిమిషాలు కేటాయించనివారు..తమ సెల్ఫీలను జిబ్లీ స్టైల్‌‌లో మార్చడానికి గంటలు గడుపుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

డోపమైన్ ట్రాప్ లో పడిపోతున్నమా..?

సోషల్ మీడియా లేదా ఇతర డిజిటల్ కార్యకలాపాల వల్ల మన మెదడులో ఒక రకమైన తాత్కాలిక ఆనందం, ఉత్సాహం కలుగుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. మెదడులోని డోపమైన్ అనే కెమికల్ విడుదల వల్ల తాత్కాలిక ఆనందం వస్తుందన్నారు. నిజానికి డోపమైన్ అనేది మనకు సంతోషం, ఆనందం, రివార్డ్ ఫీలింగ్‌‌ను ఇచ్చే న్యూరోట్రాన్స్‌‌మిటర్. సులభంగా చెప్పాలంటే..మనం సోషల్ మీడియాలో ఒక ఫొటో పోస్ట్ చేసినప్పుడు, లైక్‌‌లు, కామెంట్‌‌లు రాగానే ఒక రకమైన ఆనందం కలుగుతుంది. కొద్దిసేపటి తర్వాత ఈ ఆనందం మాయమై.. మళ్లీ అదే ఆనందం కోసం మరో పోస్ట్ చేయాలని, మరో ట్రెండ్‌‌లో పాల్గొనాలని అనిపిస్తుంది. 

ఇలా ఒక లూప్‌‌లో పడిపోవడమే డోపమైన్ ట్రాప్  అంటారు. చాట్ జీపీటీ, నానో బనానా ఫిల్టర్‌‌తో ఫొటో ఎడిట్ చేసి పోస్ట్ చేస్తే.. దానికి వచ్చే లైక్‌‌లు, కామెంట్‌‌లు మనకు సంతోషాన్ని ఇస్తాయి. కానీ ఆ సంతోషం త్వరగా మాయమై.. మళ్లీ కొత్త ట్రెండ్ కోసం ఫోన్‌‌తో గడపడం మొదలవుతుంది. ఇది ఒక రకమైన అడిక్షన్ లాంటిది. నిజమైన సంతృప్తిని ఇవ్వకపోగా.. మరింత కావాలనే ఆకలిని మాత్రం పెంచుతుంది. ఈ ట్రెండ్‌‌లు కేవలం ఎమోషనల్ జంక్ ఫుడ్ లాగా పనిచేసి..మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు. 

బుక్స్ చదవాలి..ఫ్రెండ్స్ ను కలవాలి

సోషల్ మీడియా ట్రెండ్‌‌లు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయే తప్ప నిజమైన సంతృప్తిని ఇవ్వవని సైకాలజిస్టులు చెబుతున్నారు. నానో బనానా ఎడిట్‌‌లు, జెమినీ మూడ్‌‌బోర్డ్‌‌లు, జిబ్లీ ఫొటోలతో అందంగా కనిపించడానికి శ్రమ పడే బదులు  డిజిటల్ జంక్ ఫుడ్ నుంచి బయటపడి, పుస్తకాలు చదవడం, స్నేహితులను కలవడం, నిజమైన సంబంధాలను నిర్మించడం వంటివి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని సూచిస్తున్నారు. స్నేహితుడికి ఫోన్ చేసి “హాయ్, ఎలా ఉన్నావ్?” అని అడిగితే వచ్చే సంతోషం,  నవ్వు, ఆనందం, బంధం.. ఏ ఏఐ ఫిల్టర్ ఇవ్వలేదని పేర్కొన్నారు.

క్రియేటివిటీపై ట్రెండ్‌‌ల ఎఫెక్ట్ ..

చాట్ జీపీటీ, నానో బనానా ఎడిట్‌‌లు, జెమినీ మూడ్‌‌బోర్డ్‌‌లు, జిబ్లీ ఫొటోలతో మన క్రియేటివిటీ క్షిణిస్తున్నదని సైకాలజిస్టులు తెలిపారు. “మనం మన ఊహా శక్తిని ఆల్గారిథమ్‌‌లకు అప్పగిస్తున్నాం. డ్రాయింగ్, రాయడం, ఆడుకోవడం బదులు ఒక యాప్, ప్రాంప్ట్ ల్లో  మనకు కావాల్సింది వెతుకుంటు న్నాం. ఇది ఇలాగే కొనసాగితే మన సెల్ఫ్ రెస్పెక్ట్, సృజనాత్మకత క్రమంగా క్షీణిస్తాయి. డిజిటల్ ఆటలు కూడా మానసిక ఆరోగ్యానికి మంచివే. కానీ ఆ ఆట మనల్ని స్వేచ్ఛగా ఉంచాలి. దాని ఉచ్చులో మనం బంధీ కాకూడదు. మనకు ఫోటో ఎడిట్‌‌ల వద్ద ఎక్కువ సంతోషం కలుగుతుందా లేక ఫ్రెండ్స్ తో మాట్లాడితే ఎక్కువ ఆనందం కలుగుతుందా గమనించండి” అని సూచిస్తున్నారు.