సేవలో.. సైనికుల్లా మారిన యువత!

సేవలో.. సైనికుల్లా మారిన యువత!

కొవిడ్​ బారినపడ్డారంటే.. మందులేని రోగంతోనే కాదు, ట్రీట్​మెంట్​ కోసం కూడా పోరాడాల్సిందే. ఊపిరాడక సతమతమయ్యే టైమ్​లో పేషెంట్​ని చూసుకోవడం, బెడ్స్​ వెతుక్కోవడం ఎంత కష్టమో చూశాం. ఆ కష్టాన్ని గట్టెక్కించేందుకు ముందుకొచ్చాడు శ్రీహర్ష. తనతో ఇంకొంతమంది భుజం కలిపారు. సాయం కోసం చూస్తున్నవాళ్లకు బెడ్స్​, ఆక్సిజన్​​, మెడిసిన్​.. ఏది కావాలంటే అది, ఎక్కడికంటే అక్కడ అందేలా చేశారు.  వందలమంది వారియర్స్​తో ఏర్పాటైన ‘కొవిడ్​ వార్​ రూమ్​’కి కాల్​ చేశారంటే సాయం యుద్ధ ప్రాతిపదికన అందుతుంది. 

కొవిడ్​ బారినపడ్డవాళ్లను కాపాడుకోవడానికి అటెండెంట్స్​కి చాలా కష్టంగా ఉంటుంది. హాస్పిటల్​కి చేర్చడానికి, హాస్పిటల్​ మార్చడానికి ఇంట్లోవాళ్లందరూ తలా ఒక చేయి వేసే పరిస్థితి లేదు. అంటురోగం నుంచి అందరూ సేఫ్​గా ఉండాలంటే ఒక్కరో, ఇద్దరో వెళ్లాలి. ఆ ఒక్కరే అన్నీ చూసుకోవాలంటే చాలా కష్టం. పేషెంట్​ని చూసుకుంటూ హాస్పిటల్ బెడ్స్​ కోసం, మందుల కోసం, ఆక్సిజన్​ కోసం, అంబులెన్స్​ కోసం వెదుకులాట ఎంతో కష్టంగా ఉండేది. కన్నీళ్లుపెట్టుకుంటూ తిరిగే జనాన్ని చూసి శ్రీహర్ష చలించిపోయిండు. ‘నేను కూడావాళ్లకు ఏదో ఒక సాయం చేస్తే వాళ్లకు ఆ తిరిగే బాధతప్పి కాసేపు పేషెంట్​ బాగోగులు చూసుకుంటారు కదా’ అనుకుని సాయానికి ముందుకొచ్చిండు. ‘కొవిడ్​ పేషెంట్స్​కి హాస్పిటల్​ బెడ్స్​, ఆక్సిజన్​, మెడిసిన్స్​ కోసం ఇంట్లో ఉండి నా వంతు సాయం చేస్తాను. అవసరం ఉన్నవాళ్లు మెసేజ్​ చేయండి. అవసరం ఉన్నవాళ్లకు చెప్పండి’ అని ఏప్రిల్​ 29న ఇన్​స్టాగ్రామ్​లో పోస్ట్​ చేసిండు. అది చూసి ఆక్సిజన్​ బెడ్​ కావాలని, రెమ్డిసివివర్​ ఇంజెక్షన్​​ కావాలని శ్రీహర్షకు పేషెంట్​ అటెండెంట్స్​ నుంచి మెసేజ్​లు వచ్చాయి. పేషెంట్స్​ అటెండెంట్స్​ తరపున హాస్పిటల్స్​కి కాల్​ చేసి ఎక్కడ బెడ్​ ఉందో, ఎక్కడ ఆక్సిజన్​ దొరుకుతుందో, ఎక్కడ మెడిసిన్స్​ అందుబాటులో ఉన్నాయో కనుక్కునే పనిలోపడ్డాడు.  

మేము కూడా సాయం చేస్తాం 
రెండు రోజుల్లో ఓ పాతిక మందికి సాయం చేశాడు. మూడో రోజు ఓ ముప్పై మంది నుంచి ‘మేము కూడా హెల్ప్​ చేస్తాం’ అంటూ శ్రీహర్షకు కాల్​ చేశారు. బెడ్స్​, ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్స్​, మెడిసిన్స్​ కోసం తను ఎలా సెర్చ్​ చేస్తున్నాడో వాళ్లకు చెప్పాడు. వాళ్లు కూడా అలాగే చేయడం మొదలుపెట్టారు. సాయం చేసేవాళ్లు పెరిగారు. శ్రీహర్ష తనకు వచ్చే మెసేజ్​లను వాళ్లకు ఫార్వర్డ్​ చేస్తున్నాడు. ఇలా ఒకరికొకరు ఇన్ఫర్మేషన్​ పాస్​ చేసుకుంటూ కొవిడ్​ పేషెంట్స్​కి సాయం చేస్తున్నారు. 

ఒక్క రాత్రిలో.. 
శ్రీహర్ష ట్రిపుల్​ ఐటీ, హైదరాబాద్​లో ఇంజినీరింగ్​ చదివాడు. 2016లో కోర్స్​ పూర్తి చేశాడు. వాళ్ల కాలేజీ ఫేస్​బుక్​ గ్రూపులో.. ‘కొవిడ్​ పేషెంట్స్​కి సాయం చేస్తున్నాం. మీరు కూడా సాయం చేయడానికి ముందుకు రండి. మన అవసరం ఉన్నవాళ్లు చాలా మంది ఉన్నారు’ అని పోస్ట్​ చేశాడు. వలంటీర్లుగా పనిచేసేందుకు ఇరవై, ముప్పై మంది వస్తారని ఆశించాడు. ఊహించనంత మంది ముందుకొచ్చారు. పోస్ట్​ చేసినరాత్రికే 215 మంది వలంటీర్స్​ రెడీ అయిపోయారు. తెల్లారేసరికి 300 మంది అయ్యారు. వీళ్లంతా కలిసి ‘కొవిడ్​ వార్​ రూమ్​’ పేరుతో సర్వీస్​ మొదలుపెట్టారు. వీళ్లలో తెలుగు రాష్ర్టాల్లో ఉండేవాళ్లే కాకుండా ఇతర రాష్ర్టాల్లో, అమెరికా, సౌదీలో ఉండేవాళ్లు కూడా ఉన్నారు. శ్రీహర్ష ట్విట్టర్​​, ఇన్​స్టాగ్రామ్​, ఫేస్​బుక్​కి వచ్చే రిక్వెస్టులను అందరికీ ఫార్వర్డ్​ చేస్తున్నాడు.  

వార్​ రూమ్​ రెడీ 
కొవిడ్​ వార్​ రూమ్​కు వచ్చే రిక్వెస్టులకు తగ్గట్టు వాటిని ఫాలో అప్​ చేయడానికి కావాల్సిన టెక్నాలజీని ట్రిపుల్​ ఐటీ స్టూడెంట్స్ ఒక్కరోజులోనే సెట్​ చేశారు​. శ్రీహర్షకు వచ్చే రిక్వెస్టులన్నీ ‘స్లాక్’ అనే మెసేజింగ్​ ప్లాట్​ఫామ్​లోకి ఫార్వర్డ్​ అవుతాయి. అందులో హైదరాబాద్​ నుంచి ఎవరైనా సాయం కోసం కాల్​ చేస్తే.. కొవిడ్​ వార్​ రూమ్​లో  హైదరా బాద్​ బాధ్యత చూసే వాళ్లు ఆ మెసేజ్​లు అందుకుంటారు. వెంటనే పేషెంట్​ అటెండెంట్స్​కి కాల్​ చేస్తారు. ‘వాళ్లు ఎక్కడున్నారు? ఏం కావాలి? ఎప్పటికి కావాలి?’ అని తెలుసుకుంటారు. 

బాధితులకు అకౌంట్​లోకే పైసలు 
ఈ టీమ్​ స్పీడ్​గా సాయం అందించే నెట్​వర్క్​ని పెంచుకున్న విషయం గమనించి చాలా మంది సాయం చేస్తామని ముందుకు వచ్చారు. హాస్పిటల్​ ఫీజులు, ఆక్సిజన్​ కాన్సన్​ట్రేటర్స్​, మెడిసిన్స్​ కొనలేనివాళ్లకు దాతలు ఇచ్చే డబ్బులు ఖర్చుపెట్టేందుకు వార్​ రూమ్​ వలంటీర్స్​ సాయపడుతున్నారు. కొవిడ్​ వార్​ రూమ్​ టీమ్​ ఎవరి నుంచీ నేరుగా డబ్బు తీసుకోదు. ఆన్​లైన్​లో ఫండ్ రైజింగ్​ చేసేందుకు సాయపడే ‘గుడ్​ క్లాప్స్’ ద్వారా డొనేట్​ చేయమన్నారు. పేద పేషెంట్స్​ అవసరాలు గుర్తించి, వాళ్లకు ఎంత కావాలో వలంటీర్లే ఎంక్వైరీ చేసి ఆ డబ్బుల్ని నేరుగా వాళ్ల అకౌంట్స్​లోకే ట్రాన్స్​ఫర్​ చేస్తున్నారు. దీనికోసం పది మందితో ఒక వెరిఫికేషన్​ టీమ్​ పనిచేస్తోంది. కొవిడ్​ పేషెంట్సే కాకుండా లాక్​డౌన్​ వల్ల నష్టపోయిన పేదవాళ్లకు, మెడికల్​ ఎమర్జెన్సీ ఉన్న పేద పిల్లలకు కూడా డబ్బులు ఇచ్చారు. ప్రపంచంలో ఎక్కడివాళ్లైనా కొవిడ్​ వార్​ రూమ్​కి సాయం కోసం వచ్చేవాళ్లకు goodclap.com/cwr లింక్​ ద్వారా  డబ్బు సాయం చేయొచ్చు.

దేశవిదేశాల నుంచి 
‘కొవిడ్​ వార్​ రూమ్’​ 500 మంది వలంటీర్లతో మహమ్మారిపై యుద్ధం చేస్తోంది. వీళ్లలో అమెరికా, సౌదీ అరేబియాలో జాబ్​ చేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. గూగుల్​,  ట్విట్టర్​ లాంటి కంపెనీల్లో పని చేసే ఉద్యోగులున్నారు. డ్యూటీ అయ్యాక, వార్​ రూమ్​ సర్వీసులో ఉంటున్నారు. ఇలా పనిచేయడం నాకెంతో సంతోషంగా ఉందని డెంటిస్ట్​ డాక్టర్​ మౌనిక అంటోంది. ‘నలభై మందికి సాయపడ్డాను. వాళ్ల కష్టాన్ని ఓపికగా విన్నాను. వాళ్లకు కచ్చితమైన సాయం ఎక్కడ అందుతుందో ఎంక్వైరీ చేశాను. జీవితంలో ఇంతకంటే గొప్ప పని ఏముంటుంది? లాక్​ డౌన్​ టైంలో కొవిడ్​ వార్​ రూమ్​ వల్ల నలుగురికి సాయపడే అవకాశం వచ్చింది’ అని చెప్పింది ఈ యంగ్​ డాక్టర్. మిగతావాళ్ల మాటలు కూడా ఇవే. మౌనిక లాంటి డాక్టర్లు, ఇంజినీర్లు, మేనేజర్లు, స్టూడెంట్స్​, రీసెర్చ్​ స్కాలర్స్​ చాలా మంది ఇందులో ఉన్నారు. ‘‘నాకు తోచిన సాయం చేస్తాను. వచ్చేపోయేవాళ్ల పేర్లు రాసి, ఎక్సెల్​లో మీకు డేటా ఎంట్రీ చేసిపెడతాను’’ అని దుబాయ్​లో సెక్యూరిటీ గార్డ్​గా పనిచేసే వ్యక్తి ఈ వారియర్స్​లో చేరిండు. వేల మందికి బెడ్స్​, మెడిసిన్స్​ ఇప్పించారు. అట్లనే కొవిడ్​ టైమ్​లో తిండికి ఇబ్బంది పడుతున్నామని పోచంపల్లి వీవర్స్​ కాల్​ చేస్తే 50 మందికి ఆర్థికసాయం చేశారు. పిల్లల్ని చూసుకునేందుకు పనికిపోలేని  సింగిల్​ మదర్, పాలిచ్చే తల్లులకు కూడా సాయం చేశారు. సెక్స్​ వర్కర్స్​, హెచ్​ఐవీ బాధితులకు తిండికోసమని ఆర్థిక సాయం చేశారు. పిల్లలకు ఎమర్జెన్సీ సర్జరీలకు డబ్బులు ఇచ్చారు. ‘‘ఇస్తున్నాం. ఇస్తూనే ఉంటామ’’ని వార్​ రూమ్​ వారియర్స్​ అంటున్నారు. 

కొవిడ్​ వార్​ రూమ్​కి కాల్​ చేసేవాళ్ల కోసం ఒక హెల్ప్​ లైన్​ నెంబర్​ ఏర్పాటు చేశారు. అవసరం ఉన్నవాళ్లు ఈ​ 63042 96587 నెంబర్​కు కాల్​ చేయొచ్చు.

కన్నీళ్లు తుడుద్దాం
‘‘ఇంట్లోవాళ్లు కొవిడ్​ బారినపడితే వాళ్ల బాధల్లో వాళ్లుంటారు. అటెండెంట్స్​ ఎమోషన్​ బర్డెన్​తో ఉంటారు. ఆ టెన్షన్​లో బ్లడ్​ కోసం, మందుల కోసం ఫోన్​ చేయడం కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎంక్వైరీ చాలా స్పీడ్​గా చేయగలుగుతాం. పని తొందరగా అవుతుంది. వాళ్లకు టైమ్​ సేవ్​ అవుతుంది. వాళ్లకు పేషెంట్​ని చూసుకునే టైమ్​ దొరుకుతుంది’’.
- శ్రీహర్ష కారంచేటి 

నాగవర్దన్​ రాయల