
నల్లబెల్లి, వెలుగు: కేంద్రంలో బీజేపీ పాలనపై రాష్ట్ర యువత ఆసక్తి చూపుతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లబెల్లి మండలం గొల్లపల్లి, కీరతండా గ్రామాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 60 కుటుంబాలు బీజేపీలో చేరాయి. రేవూరి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహరెడ్డి, సుదర్శన్, సంతోష్, పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో ఆదివాసీ దినోత్సవం
జనగామ అర్బన్, వెలుగు: బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు బానోతు రాంకోటి నాయక్ ఆధ్వర్యంలో జనగామలో ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం నిర్వహించారు. చీఫ్ గెస్ట్‌గా బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో దేవరాయ ఎల్లయ్య, రమేశ్, కేవీఎల్ఎన్ రెడ్డి, ప్రేమలతారెడ్డి, శివరాజ్ యాదవ్ పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో జాతీయ జెండాల పంపిణీ
జనగామ అర్బన్, వెలుగు: భారత వజ్రోత్సవ వేడుకల సందర్భంగా జనగామలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత రెడ్డి ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీని చేపట్టారు. నల్గొండ జిల్లాలో సాగుతున్న బండి సంజయ్పాదయాత్రకు ఇక్కడి నుంచి కార్యకర్తలు తరలివెళ్లేలా కార్యాచరణ సిద్ధంచేసేందుకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి మంగళవారం జనగామకు వచ్చారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి పాపరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిరికొండ విద్యాసాగర్‌రెడ్డి, కె.విలన్ రెడ్డి పాల్గొన్నారు.
14 రోజులపాటు వజ్రోత్సవ వేడుకలు
ములుగు, వెలుగు: వజ్రోత్సవ వేడుకల్లో ప్రతీ ఒక్కరూ పాల్గొని ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని కలెక్టర్ఎస్.కృష్ణ ఆదిత్య పిలుపునిచ్చారు. జిల్లాలో14 రోజులపాటు ఘనంగా వేడుకలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. మంగళవారం ములుగు గ్రామపంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో పట్టణ కేంద్రంలో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా కవి సమ్మేళనం నిర్వహిస్తున్నామని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 16న సాయంత్రం 5గంటలకు కలెక్టరేట్లో కవి సమ్మేళనం జరుగుతుందని, ఆసక్తి గలవారు తమ కవితలను 13 లోపు 9948392976 నెంబరుకు వాట్సప్ చేయాలని కోరారు.
మహబూబాబాద్,వెలుగు: ఆగస్టు 13నుంచి 15 వరకు ప్రజలు తమ ఇండ్లపై జెండాలు ఎగురేయాలని మహబూబాబాద్జిల్లా కలెక్టర్ కె. శశాంక కోరారు. మంగళవారం మహబూబాబాద్ మండలం మల్యాల గ్రామంలో కలెక్టర్.. ప్రజాప్రతినిధులతో జిల్లా, మండల గ్రామ స్థాయి, ఆఫీసర్లతో కలిసి ఇంటింటికి వెళ్లి జాతీయ జెండాలను అందజేశారు.
నేడు వరంగల్ చేరనున్న రమేశ్ డెడ్‌బాడీ
వరంగల్, వెలుగు: నైజీరియా దేశంలో టెర్రరిస్టుల కాల్పుల్లో మృతిచెందిన గ్రేటర్ వరంగల్‍కు చెందిన గుర్రపు రమేశ్(38) డెడ్‌బాడీ బుధవారం ఆయన నివాసానికి చేరుకోనుంది. కోగి రాష్ట్రం అజకూటలో వీరు పనిచేసే సంస్థ నుంచి నివాసం ఉండే చోటుకు వెళ్తుండగా.. శుక్రవారం రాత్రి బొకోహరం ఇస్లామిక్ తీవ్రవాద సంస్థకు చెందిన దుండగులు వీరి బస్సుపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రమేశ్ చనిపోయారు.
కళతప్పిన పబ్లిక్‌గార్డెన్
గ్రేటర్ వరంగల్‌లో పబ్లిక్‌గార్డెన్ ఓ ల్యాండ్‌మార్క్. ఉమ్మడి జిల్లావాసులకే కాకుండా పక్క జిల్లాలకు కూడా పబ్లిక్గార్డెన్అనగానే ఆహ్లాదకర వాతావరణం, అనేక కార్యకలాపాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలతోపాటు ఆటపాటా, మాటముచ్చట, వ్యాయామం.. తదితర యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అలాంటి గార్డెన్ సమస్యలతో కళ తప్పింది. కలర్వెలిసిపోయిన బొమ్మలు, ఓపెన్ జిమ్ వద్ద నిలిచిన వరద నీరు, విరిగిన ఆట వస్తువులతో సమస్యలకు నిలయంగా మారింది.
ఘనంగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం
ములుగు, వెలుగు: ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ములుగులోని అంబేడ్కర్విగ్రహం వద్ద ఆదివాసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సీతక్క, డీఎంహెచ్‌వో డా. అప్పయ్యతో కలిసి జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీల నివసించే ఏజెన్సీలో ఇప్పటికీ కనీస సౌకర్యాలు లేవన్నారు. కుమ్రం భీం స్ఫూర్తిగా ఆదివాసీ సంస్కృతీ, సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ నాయకపోడ్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ఆధ్వర్యంలో గట్టమ్మ దేవాలయం వద్ద జెండా ఎగురవేశారు. పస్రాలో తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు చింత కృష్ణ ఆధ్వర్యంలో కుమ్రంభీం విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
ఆదివాసీల సేవలో ఐటీడీఏ
ఏటూరునాగారం, వెలుగు: గిరిజనుల అభివృధ్దికోసం ఏర్పాటు చేసిన ఐటీడీఏ నిత్యం ఆదివాసీల అభివృద్ధికి పనిచేస్తోందని పీవో అంకిత్ అన్నారు. మంగళవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఐటీడీఏలోని కుమ్రంభీం విగ్రహానికి పీవో అంకిత్, ఆదివాసీ అనుబంధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తుడుందెబ్బ నాయకులు మాట్లాడుతూ ఆదివాసీలు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలన్నారు.
జాతీయ సమైక్యతను చాటాలి
జనగామ, వెలుగు: జాతీయ సమైక్యతను ప్రతి ఒక్కరిలో నిలిపేందుకు ఇంటింటా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. మంగళవారం జనగామ కలెక్టరేట్ లో జరిగిన స్వతంత్ర వజ్రోత్సవాల వేడుకలకు చీఫ్ గెస్ట్ గా హాజరై ఇంటింటికి జాతీయ జెండాల పంపిణీని ప్రారంభించారు. అంతకుముందు వివిధ శాఖల పరిధిలోని జిల్లా ఆఫీసర్లు, ప్రజా ప్రతినిధులతో రివ్యూ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు పంపిణీని ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. అంతకుముందు జిల్లా కేంద్రంలోని దేవి థియేటర్ లో గాంధీ సినిమాను మంత్రి దయాకర్ రావు, కలెక్టర్ శివలింగయ్య స్టూడెంట్స్‌తో కలిసి తిలకించారు. కార్యక్రమంలో జనగామ, స్టేషన్ఘన్పూర్ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రాజయ్య, జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్లు భాస్కర రావు, అబ్దుల్ హమీద్, మున్సిపల్‌చైర్ పర్సన్ జమున, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ సేవలు ప్రజలకు చేరాలి
నర్సింహులపేట, వెలుగు: పోలీస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, మారుతున్న సొసైటీకి అనుగుణంగా పోలీసులు అప్డేట్ కావాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీస్ స్టేషన్ ను ఎస్పీ విజిట్ చేశారు. పలు రికార్డులు రిజిస్టర్లు పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి 20మంది పేదలకు దుప్పట్లు, రైస్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘు, సీఐ సత్యనారాయణ, ఎస్సై మంగిలాల్ పాల్గొన్నారు.
ప్రయాణిస్తున్న స్కూటీలో పాము
నెక్కొండ, వెలుగు: స్కూటీపై ప్రయాణిస్తుండగా హ్యాండిల్లో నుంచి పాము కనిపించిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో జరిగింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం.. అప్పల్రావుపేట గ్రామానికి చెందిన మహ్మద్ఖాదర్పాష స్కూటీపై నెక్కొండకు వెళుతుండగా హ్యాండిల్నుంచి(మంజరగున్న) పాము బయటకు వచ్చింది. వెంటనే బైక్ఆపి కర్రతో పామును కిందపడేశాడు.
మైనర్ నిశ్చితార్థాన్ని అడ్డుకున్న ఆఫీసర్లు
పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం పెద్దతండాలో ఓ బాలికకు నిశ్చితార్థం, పెళ్లి ప్రయత్నాన్ని ఆఫీసర్లు అడ్డుకున్నారు. మంగళవారం తండాలోని బాలికకు నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు బాలల సంరక్షణ, చైల్డ్‌లైన్, ఐసీడీఎస్, పోలీస్ ఆఫీసర్లు అక్కడికి చేరుకొని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పెళ్లి చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి, వారితో లిఖితపూర్వకంగా హామీ పత్రాన్ని రాయించుకున్నారు. కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేందర్ రెడ్డి, ఐసీడీఎస్ సెక్టార్ సూపర్ వైజర్ లలిత, చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ వీరబాబు పాల్గొన్నారు.
బీజేపీలో చేరిక
గూడూరు, వెలుగు: మహబూబాబాద్జిల్లా గూడూరు మండలం వడ్డెర గూడేనికి చెందిన 30మంది వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు బీజేపీలో చేరారు. గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనతో విసుగు చెందిన ప్రజలు బీజేపీ వైపు అడుగులు వేస్తున్నారన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మోతీలాల్, సురేందర్, రాంబాబు, భాస్కర్, వెంకన్న, రాజు పాల్గొన్నారు.
దళిత బంధు పథకంలో ఆడిట్ ఆఫీసర్ల వసూళ్లు
హనుమకొండ, కమలాపూర్, వెలుగు: దళితబంధు పథకంలో ఆఫీసర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. కమలాపూర్ మండలం ఉప్పల్గ్రామంలో కొంతమంది లబ్ధిదారులకు దళితబంధు స్కీమ్ కింద వివిధ యూనిట్లు మంజూరు కాగా.. 10 రోజుల నుంచి కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఆఫీసర్లు ఆడిటింగ్ చేస్తున్నారు. కొంతమంది లబ్ధిదారుల నుంచి ఆడిటింగ్ ఆఫీసర్లు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఒక్కో లబ్ధిదారు నుంచి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారని, అడిగినంత ఇవ్వకపోతే కొర్రీలు పెడుతున్నారని వాపోతున్నారు. ఉప్పల్ గ్రామంలో ఆడిటింగ్‌కు వచ్చిన ఓ ఆఫీసర్వసూళ్లకు పాల్పడుతున్న వీడియో మంగళవారం సోషల్‌మీడియాలో వైరల్ అయ్యింది.
అక్రమ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు
మరిపెడ, వెలుగు: ప్రభుత్వం నిషేధించిన వ్యాపారాలు చేసేవారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. మంగళవారం మరిపెడ పోలీస్ స్టేషన్ లో మీడియాతో మాట్లాడారు. మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలో వారం కింద 12.5 టన్నుల నల్లబెల్లం,10 బస్తాల పటిక,30 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, నలుగురు నిందితులను అరెస్ట్‌చేసినట్లు చెప్పారు. దీంతోపాటు తొర్రూర్స్టేషన్పరిధిలో 10.8 క్వింటాళ్లు, పెద్దవంగర మండలంలో 30 క్వింటాళ్ల పీడీఎస్ స్వాధీనం చేసుకొని వాహనాలను సీజ్‌చేసి 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో తొర్రూర్ డీఎస్పీ రఘు, సీఐలు ఎన్.సాగర్, శ్రీనివాస్ నాయక్, సత్యనారాయణ, ఎస్సైలు పాల్గొన్నారు.
చేపల వేటకు వెళ్లి ఒకరు మృతి
మరిపెడ, వెలుగు: మహబూబాబాద్జిల్లా మరిపెడ మండలంలో స్నేహితులతో చేపల వేటకు వెళ్లిన ఓ తాపీమేస్త్రి చనిపోయాడు. స్థానికుల వివరాల ప్రకారం.. సీరోల్ మండలం కందికొండకు చెందిన షేక్ మీరా(30) అనే తాపీ మేస్త్రి సోమవారం మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామంలోని దామేరా చెరువు మత్తడి వద్దకు చేపలు పట్టడానికి స్నేహితులతో కలిసి వెళ్లాడు. చేపలు పడుతుండగా కాలు వలలో చిక్కుకుని కిందపడి వరద ప్రవాహంలో కొట్టుకొనిపోయాడు. స్నేహితులు కాపాడడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీస్, రెవెన్యూ, ఫైర్ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేశారు. మంగళవారం ఉదయం షేక్ మీరా డెడ్ బాడీని చెరువులో గుర్తించి బయటికి తీశారు.