మెడికల్ మత్తులో యూత్.. డ్రగ్, గాంజాపై పోలీసుల ఉక్కుపాదంతో రూట్ మార్చిన అడిక్ట్స్

మెడికల్ మత్తులో యూత్.. డ్రగ్, గాంజాపై పోలీసుల ఉక్కుపాదంతో రూట్ మార్చిన అడిక్ట్స్
  • ప్రత్యామ్నాయంగా ఫార్మా మందులవైపు మళ్లుతున్న యువకులు
  • నిద్రమాత్రలు, పెయిన్ కిల్లర్లే నయా మత్తు మందులు
  • మెడికల్ షాపుల్లో గల్లీకో రేటు.. ప్రిస్క్రిప్షన్ లేకుండానే యథేచ్ఛగా అమ్మకాలు
  • ఇటీవల ఓల్డ్ సిటీలో డ్రగ్ ఓవర్ డోస్​తో ఇద్దరు మృతి 

హైదరాబాద్, వెలుగు:
గల్లీల్లో గంజాయి దొరకడం కష్టమవ్వడంతో సిటీ యువత రూట్ మార్చింది. నిన్నటి దాకా గంజాయి మత్తులో తేలియాడినవాళ్లు.. ఇప్పుడు మెడికల్ షాపులనే అడ్డాలుగా మార్చుకుంటున్నారు. చీప్ అండ్ ఈజీగా కిక్ ఇచ్చే ఫార్మాస్యూటికల్ డ్రగ్స్(నిద్ర మాత్రలు, పెయిన్ కిల్లర్లు) వైపు మళ్లుతున్నారు. గంజాయి, ఎండీఎంఏ, కొకైన్ లాంటి డ్రగ్స్‌‌‌‌పై పోలీసులు ఉక్కుపాదం మోపడం, దొరికినా రేట్లు భారీగా ఉండటంతో.. ప్రత్యామ్నాయంగా మెడికల్ మత్తుకు వెల్కమ్ చెబుతున్నారు. ఇటీవలే ఓల్డ్ సిటీలో ఇద్దరు యువకులు అట్రానియం ఇంజక్షన్, పైవాన్ ట్యాబ్లెట్ ఓవర్ డోస్ అయి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఒక ఉదాహరణ మాత్రమేనని, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇంతకంటే భయానకంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఆల్ప్రాజోలం నుంచి కోడైన్ దాకా..

కొన్ని ఫార్మసీలు, మెడికల్ ఏజెన్సీల యజమానుల ధన దాహం యువత పాలిట శాపంగా మారుతోంది. కేవలం వంద, రెండు వందల రూపాయలుండే మందులను.. బ్లాక్‌‌ లో గల్లీకో రేటు పెంచి, చాక్లెట్లు అమ్మినట్లు అమ్మేస్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉందా లేదా అని చూడకుండానే షెడ్యూల్డ్ డ్రగ్స్‌‌ను చేతిలో పెడుతున్నారు. ముఖ్యంగా నిద్రలేమి, ఆందోళన తగ్గించే ఆల్ప్రాజోలం, నైట్రాజిఫామ్, క్లోనజాపమ్ ట్యాబ్లెట్లను యువత మింగేస్తున్నారు. ఇక తీవ్రమైన నొప్పులకు వాడే ట్రమడాల్, పెంటాజోసిన్, ఫోర్ట్విన్, టాపెండడాల్ వంటి ఓపియాయిడ్ ఇంజెక్షన్లను నేరుగా నరాలకు ఎక్కించుకుంటున్నారు. దగ్గు మందుగా వాడే కోడైన్ సిరప్ సీసాలను గటగటా తాగేస్తున్నారు. వీటిని రెండు మూడు నెలలు వాడితే.. ఇక ఆ మందు లేనిదే బతకలేని స్థితికి(అడిక్షన్) గురవుతారు. వీటి వల్ల కిడ్నీలు, లివర్ దెబ్బతినడమే కాకుండా సడెన్ గా గుండె ఆగిపోయే ప్రమాదం ఉందని డాక్టర్లు 
హెచ్చరిస్తున్నారు. 

మెడికల్ షాపుల్లో పత్తాలేని హెచ్1 డ్రగ్ రిజిస్టర్.. 

రూల్స్ ప్రకారం ప్రతి మెడికల్ షాపులో షెడ్యూల్ హెచ్1 డ్రగ్ రిజిస్టర్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. యాంటీబయాటిక్స్, మత్తునిచ్చే మందుల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకే కేంద్రం ఈ రూల్ తెచ్చింది. డాక్టర్ చీటీ లేకుండా వీటిని అమ్మకూడదు. ఒకవేళ అమ్మితే పేషెంట్ వివరాలు, డాక్టర్ పేరు, మందు పేరు రిజిస్టర్‌‌ లో రాసి మూడేళ్లు భద్రపరచాలి. కానీ రాష్ట్రంలోని మెజారిటీ షాపుల్లో ఈ రిజిస్టర్ ఊసే లేదు. మెడికల్ షాపులు, ఫార్మసీ షాపుల్లోకి ఎన్ని షెడ్యూల్ మందులు వస్తున్నాయి. ఎన్ని అమ్ముడవుతున్నాయి. ఎన్ని పక్కదారి పడుతున్నాయన్న రిజిస్టర్ ను ఎవరూ పట్టించుకోకపోతుండటంతో.. మెడికల్ మత్తు దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్నది. అడపాదడపా తనిఖీలకు వచ్చే అధికారులు కూడా ఈ హెచ్1 డ్రగ్ రిజిస్టర్ గురించి ఆరా తీయడంలేదు.  

గంజాయి కట్టడితోనే ఇటువైపు..

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అంటేనే భయపడేలా టీజీనాబ్, ఎక్సైజ్, పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. సప్లయ్ చైన్‌‌ను తెంచేయడం, సరిహద్దుల్లో చెక్ పోస్టులు పెట్టడం, పెడ్లర్లను జైలుకు పంపడంతో సరుకు దొరకడం గగనమైంది. ఒకప్పుడు రూ. 500కు దొరికే చిన్న గంజాయి ప్యాకెట్ ఇప్పుడు రూ. 2 వేల పైమాటే పలుకుతోంది. సింథటిక్ డ్రగ్స్ రేట్లు సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరాయి. ఈ పరిణామంతో సరుకు దొరక్క, రేట్లు భరించలేక అడిక్ట్స్ ఇలా మెడికల్ మత్తు వైపు మళ్లారు. డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) గతేడాది 20 షాపుల లైసెన్సులు రద్దు చేసినా, తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (టీజీనాబ్)148 కోట్ల ఫార్మాస్యూటికల్ డ్రగ్స్‌‌ను, ఈ ఏడాది ఏప్రిల్ వరకు రూ. 18 కోట్ల విలువైన సరుకును సీజ్ చేసినా.. దొంగచాటు దందా మాత్రం ఆగడం లేదు. 

డీసీఏకు విజిలెన్స్ దన్ను కావాలి.. 

ప్రస్తుతం డ్రగ్ కంట్రోల్ శాఖ (డీసీఏ)లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పైగా వీరికి పోలీసుల్లాగా ప్రత్యేకమైన ఇంటెలిజెన్స్ వింగ్ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏడీ విజిలెన్స్ ఇంటెలిజెన్స్ ఉండేది. ప్రస్తుతం ఏపీలోనూ ఉంది. కానీ మన రాష్ట్రంలో ఆ పోస్టు లేదు. మెడికల్ మాఫియాను అడ్డుకోవాలంటే డీసీఏలో ఇంటెలిజెన్స్ వింగ్ ఏర్పాటు చేయాలి లేదా టీజీనాబ్, పోలీసుల సహకారంతో స్పెషల్ ఆపరేషన్లు నిర్వహించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ‘‘మెడికల్ మత్తుకు చెక్ పెట్టేందుకు కాలేజీలు, హాస్టల్స్ సమీపంలో ఉండే షాపులపై ప్రత్యేక నిఘా పెట్టాలి. స్కూళ్లు కాలేజీలలో మెడికల్ మందులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందులు అమ్మితే జరిమానాలతో సరిపెట్టకుండా, లైసెన్స్ రద్దు చేసి నాన్ -బెయిలబుల్ కేసులు పెట్టాలి. ఈ మెడికల్ మత్తును ఇప్పుడే తుంచేయకపోతే భావి తరాలు నిర్వీర్యమయ్యే ప్రమాదం ఉంది’’  అని సామాజికవేత్తలు అభిప్రాయపడుతున్నారు.