వెయ్యేళ్ల నాటి గోల్డ్‌ కాయిన్స్‌ను కనుగొన్న ఇజ్రాయెల్‌ యువకులు

వెయ్యేళ్ల నాటి గోల్డ్‌ కాయిన్స్‌ను కనుగొన్న ఇజ్రాయెల్‌ యువకులు

జెరూసలెం: ఇజ్రాయెల్‌లో మట్టి కుండలో దాచిన వెయ్యేళ్ల నాటి బంగారు నాణేలను కొందరు యువకులు గుర్తించారు. ఈ నెల 18న యువకులు వీటిని గుర్తించారని ఇజ్రాయెల్ యాంటీక్విట్స్‌ అథారిటీ సోమవారం తెలిపింది. సెంట్రల్ ఇజ్రాయెల్‌లో టీనేజ్ వాలంటీర్స్ తవ్వకాలు జరుపుతుండగా విలువైన ఈ నిధి బయటపడింది. ‘దాదాపు 1,100 ఏళ్ల క్రితం ఈ నిధిని దాచిపెట్టిన వ్యక్తి వీటిని తిరిగి తీసుకెళ్లాలని భావించాడు. అందుకు ఆ ప్రాంతంలో ఒక ఓడను కూడా సిద్ధం చేసుకున్నాడు. అయితే ఈ సంపదను వెనక్కి తీసుకెళ్లకుండా అతణ్ని ఏం నిరోధించిందనేది మేం మాత్రమే ఊహించగలం’ అని తవ్వకాలకు నాయకత్వం వహించిన లియట్ నదవ్‌జివ్ అనే ఇజ్రాయెల్ అధికారి చెప్పారు.

ఈ నిధిని దాచిన సమయంలో ఆ ఏరియాలో వర్క్‌షాప్స్ ఉండేవని, వాటి ఓనర్ ఎవరనేది ఇప్పటికీ అంతుబట్టని విషయమని లియన్ అన్నారు. ‘ఇది అమేజింగ్. నేను తవ్వకాలు జరుపుతున్నప్పుడు ఏదో పలుచటి వస్తువు చేతికి తాకింది. నేను మళ్లీ తడిమి చూశా. అప్పుడు గోల్డ్ కాయిన్స్ కనిపించాయి. ఇలాంటి ప్రాచీన నిధిని కనుక్కోవడం ఎగ్జయిటింగ్‌గా అనిపిస్తోంది’ అని ఓజే కోహెన్ అనే యంగ్ వాలంటీర్ పేర్కొన్నాడు.