ఆరేళ్ల అమ్మాయి..55 కోట్ల ఇల్లు కొనేసింది

ఆరేళ్ల అమ్మాయి..55 కోట్ల ఇల్లు కొనేసింది

చూడ్డానికి చిన్నగా కనిపిస్తున్నా చిచ్చరపిడుగీ చిన్నారి. ఆరేళ్ల వయసులోనే సుమారు ₹55.12 కోట్ల విలువైన (80 లక్షల డాలర్లు, 950 కోట్ల కొరియన్​ వొన్​లు) ఐదంతస్తుల ఇల్లు కొనేసింది. ఉండేది దక్షిణ కొరియాలోని సియోల్​లో. పేరు బోరమ్​. అంత చిన్న వయసులోనే యూట్యూబ్​లో వీడియోలు చేస్తూ స్టార్​ అయిపోయిందీ చిన్నారి. 3 కోట్ల మందికిపైగా సబ్ స్రై ​స్క్రైబర్లున్నారామెకు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో యూట్యూబ్​లో రెండు చానెళ్లను నడిపిస్తోంది బోరం. ఒక చానెల్​ ద్వారా బొమ్మల రివ్యూలు ఇస్తుంటుంది. ఆ చానెల్​ను 1.36 కోట్ల మంది సబ్​స్క్రైబ్​ చేసుకున్నారు. రెండో చానెల్​లో రకరకాల వీడియోలు పోస్ట్​ చేస్తుంటుంది. ఆ చానెల్​కు దాదాపు 1.76 కోట్ల మంది సబ్​స్క్రైబ్​ అయ్యారు. ఆ ఫాలోయింగ్​తోనే ఆ చిన్నారి డబ్బులు బాగా సంపాదిస్తోంది మరి. ఈ ఏడాది ప్రారంభంలోనే సియోల్​లోని గంగ్నమ్​ అనే పోష్​ సబర్బన్​ ప్రాంతంలో ఇల్లు కొన్నది. అయితే, అంత మంది ఫాలోవర్లను సంపాదించుకున్నా, వివాదాలూ ఆమెను చుట్టుముట్టాయి. దేశ విలువలను అవమానించేలా ఆ చిన్నారి చేస్తున్న వీడియోలున్నాయంటూ కొందరు జనం, స్వచ్ఛంద సంస్థ సేవ్​ ద చిల్డ్రెన్​కు ఫిర్యాదు కూడా చేశారు. ఆ చిన్నారి చేస్తున్న వీడియోల వల్ల పిల్లల మనసు, నైతిక విలువలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తండ్రి పర్సు నుంచి డబ్బులు కొట్టేయడం, రోడ్లపై కారు నడపడం వంటి వీడియోలను ఆ చిన్నారి పోస్ట్​ చేస్తోందన్న ఫిర్యాదులొచ్చినట్టు సేవ్​ ద చిల్డ్రెన్​ అడ్వొకసీ డిపార్ట్​మెంట్​ మేనేజర్​ కో వూయూన్​ చెప్పారు. ఆ వీడియోలను పోలీసులకూ చూపించినట్టు సేవ్​ ద చిల్డ్రెన్​ చెప్పింది. దీంతో పిల్లల వేధింపుల నివారణకు రూపొందించిన కౌన్సిలింగ్​  కోర్సును డిజైన్​ చేయాల్సిందిగా బోరమ్​ తల్లిదండ్రులకు సియోల్​ ఫ్యామిలీ కోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. అలాంటి వీడియోలను యూట్యూబ్​ నుంచి తొలగించేశారు.