వైసీపీ కీలక నేతలతో సమావేశమయ్యారు వైఎస్ జగన్. బుధవారం ( మే 27 ) నిర్వహించిన ఈ సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసనీ.. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనేది రుజువైందని అన్నారు. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని బాబు నమ్మించారని.. మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుదని అన్నారు.
కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైందని.. మూడోసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కూడా సూపర్ 6 సూపర్ 7 లేదని ఎద్దేవా చేశారు జగన్. ఆడబిడ్డ నిధికి నిధుల్లేవని...18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలకు ఏడాదికి రూ.18 వేలు లేవని అన్నారు. 50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వలేదని.. నిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారని అన్నారు.
ఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోందని... మావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారని అన్నారు జగన్. పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారని..తగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారని అన్నారు జగన్. ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీనే కదా? ఎందుకు తగ్గించడం లేదని ప్రశ్నించారు. తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతోందని అన్నారు.
ఇప్పటికీ హామీల అమలు లేదని.. మేనిఫెస్టో అడ్రస్ కనిపించదని అన్నారు. ఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్ కు దిగారని అన్నారు. గొడ్డళ్లు కత్తులు,కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారని మండిపడ్డారు జగన్. ప్రజలను పిచ్చోళ్లని చంద్రబాబు అనుకుంటున్నారని.. కానీ, తెలివైన వాళ్లని గుర్తించాలని అన్నారు.
