
నెలరోజుల్లో సీన్ మారింది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న టైమ్ లో .. మే 12న ఏపీ సెక్రటేరియట్ లో చంద్రబాబు… రివ్యూ మీటింగ్ జరిపారు. మంత్రులతో సమావేశం అయ్యారు. మళ్లీ జూన్ 10నాటికి ఏపీ సెక్రటేరియట్ లో సీన్ మారింది. ఎన్నికల ఫలితాలతో అధికారం చేతులు మారింది. వైఎస్ జగన్ సీఎం అయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత.. ఇవాళ తొలిసారి కేబినెట్ మీటింగ్ నిర్వహించారు.
చంద్రబాబు ప్లేస్ లో.. అదే చెయిర్ లో ఇపుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ సీన్ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఏపీ సెక్రటేరియట్ లో సీఎం చెయిర్ వెనుక డిజైన్ కళ్లుచెదిరేలా ఉంటుంది. ఆ ఫ్రేమింగ్ గమనించినవాళ్లంతా.. బాబు పోయి.. జగన్ వచ్చె.. అనుకున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలోనూ బాగా షేర్ అయ్యాయి. వైసీపీ నాయకులు, కార్యకర్తల సోషల్ మీడియా అకౌంట్లలో డిస్ ప్లే పిక్చర్(DP)లుగా మారిపోయాయి.
తీసుకున్న నిర్ణయాలివే
అమరావతి లోని ఏపీ సెక్రటేరియట్ లో జగన్ మంత్రివర్గ తొలి సమావేశం ఐదు గంటల పాటు సాగింది. ఎన్నికల హామీల అమలుపై దృష్టి పెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి.. 8 అంశాలపై చర్చించారు. పెన్షన్లు 2 వేల 250 కి పెంచుతూ ఆమోదం తెలిపారు. ఆశా వర్కర్ల జీతాలు రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, మున్సిపల్ కార్మికుల జీతాల పెంపునకు అంగీకారం తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. హోమ్ గార్డుల జీతాల పెంపు, సీపీఎస్ విధానం రద్దుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అక్టోబర్ నుంచి రైతు భరోసా పథకం అమలుకు ఆమోదం తెలిపింది సీఎం జగన్ కేబినెట్.