
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో నటుడు, కూటమి ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ సీఎం జగన్, చిరంజీవి లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ వ్యాఖ్యలపై అటు వైసీపీ క్యాడర్, ఇటు మెగాస్టార్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాలకృష్ణపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో గురువారం ( అక్టోబర్ 23 ) మీడియా సమావేశంలో మాట్లాడుతూ..అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలపై స్పందించారు జగన్. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారని.. పనీపాటా లేని సంభాషణలు చేశారని అన్నారు జగన్.
అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి..? ఆయన మాట్లాడింది ఏంటని అన్నారు. తాగి వచ్చిన వ్యక్తిని స్పీకర్ అసెంబ్లీలోకి ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు జగన్. అలా మాట్లాడేందుకు స్పీకర్ కి అయినా బుద్ది లేదని మండిపడ్డారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి ఏంటో అక్కడే అర్థమవుతోందని.. అలా మాట్లాడినందుకు సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందొ ఆయనే ప్రశ్నించుకోవాలని అన్నారు జగన్.
అసెంబ్లీలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వ్యాఖ్యలపై స్పందిస్తూ బాలకృష్ణ తన ప్రస్తావన తీసుకురావడం పట్ల చిరంజీవి ఇదివరకే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారని.. సినిమా వాళ్లకు ఎలాంటి అవమానం జరగలేదని అన్నారు జగన్. చిరంజీవి ప్రెస్ నోట్ తో సద్దుమణిగిన ఈ వివాదం ఇపుడు జగన్ రియాక్షన్ తో మళ్ళీ తెరపైకి వచ్చింది. మరి, ఇప్పుడైనా బాలకృష్ణ నుంచి స్పందన ఉంటుందా లేదా అన్నది వేచి చూడాలి.