మా టైమ్ లోనే స్పీడ్ గా రాయలసీమ లిఫ్ట్..వెయ్యి కోట్లు ఖర్చు చేసి వేగంగా పనులు చేశాం:జగన్

మా టైమ్ లోనే స్పీడ్ గా రాయలసీమ లిఫ్ట్..వెయ్యి కోట్లు ఖర్చు చేసి వేగంగా పనులు చేశాం:జగన్
  •     వెయ్యి కోట్లు ఖర్చు చేసి వేగంగా పనులు చేశాం: వైఎస్ జగన్
  •     రాయలసీమ, నెల్లూరుకు ఆ ప్రాజెక్టు సంజీవని
  •     తెలంగాణ టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు కేసులు వేయించారని వ్యాఖ్య

    
హైదరాబాద్, వెలుగు: తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పనులు స్పీడ్​గా జరిగాయని.. కానీ, ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు కేసులు వేయించారని ఏపీ మాజీ సీఎం జగన్మోహన్​ రెడ్డి ఆరోపించారు. తన విజ్ఞప్తి మేరకే చంద్రబాబు పనులు ఆపినట్లు ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. గురువారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జగన్ మీడియాతో మాట్లాడారు.‘‘శ్రీశైలంలో 800 అడుగుల నుంచి 3 టీఎంసీలు తీసుకునేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టాం. రూ.వెయ్యి కోట్లతో వేగంగా పనులు చేశాం. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టుల్లో నీళ్లు నింపటానికి చేపడుతున్నదే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దీనిని పూర్తిచేయకపోతే చరిత్ర హీనులవుతాం.. కానీ ఈ ప్రాజెక్టు పూర్తయితే జగన్​కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చంద్రబాబు కుట్రలు చేశారు. 

 ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు పెట్టడానికి, భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి కొంత మంది పాలకులు పనిచేస్తున్నారు.. ఎన్నో ఏండ్లు రెండు రాష్ట్రాల ప్రజలు కలిసే ఉన్నారనే విషయాన్ని గుర్తించాలి’’ అని జగన్ అన్నారు. ఇండస్ట్రీలో తనకు 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు రాయలసీమ లోని రిజర్వాయర్లను కూడా నింపలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. “రాష్ట్రాన్ని చంద్రబాబు ఎలా అమ్మకానికి పెట్టారో రేవంత్ రెడ్డి చెప్పారు.. స్వార్థ రాజకీయల కోసం రాష్ట్ర ప్రజలను బాబు తాకట్టు పెట్టారు. ఇలాంటి చరిత్ర హీనులు దేశంలో ఎవరూ ఉండరు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరం లేదని మాట్లాడుతున్నారు.. అంటే, రేవంత్ రెడ్డితో వీళ్లకు రహస్య ఒప్పందం ఉందని తెలుస్తోంది. రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వెనుక గొప్ప ఆలోచన ఉంది. రాయలసీమ, నెల్లూరుకు ఆ ప్రాజెక్ట్ సంజీవని వంటింది. పోతిరెడ్డిపాడు నుంచి 101 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి.. కానీ, 20 ఏండ్లలో రెండు, మూడు సార్లే ఆ నీటిని తీసుకున్నాం. 800 అడుగులలోపే 2 టీఎంసీల నీళ్లు తీసుకునేందుకు తెలంగాణలో పాలమూరు-– రంగారెడ్డి మొదలుపెట్టారు. రాష్ట్రానికి, రాయలసీమ ప్రయోజనానికి విఘాతం కలిగించేలా చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయి. చంద్రబాబు మౌనంగా ఉండటం వల్ల శ్రీశైలం ఎగువ భాగంలో తెలంగాణ ప్రాజెక్టులు చేపట్టింది. తెలంగాణకు, అక్కడి ప్రజలకు నష్టం చేయాలని ఏ రోజు పనిచేయలేదు, పనిచేయను. మా ప్రాంతానికి, మా ప్రజలకు న్యాయం చేయటం మా బాధ్యత, ధర్మం” అని జగన్ పేర్కొన్నారు. ఎస్ఎల్ బీసీ  ద్వారా 45 టీఎంసీలు తరలించే పనులు చేస్తున్నారని, 777 అడుగుల నుంచే ఎడమవైపు పవర్ హౌస్ ద్వారా 4 టీఎంసీల నీళ్లను తెలంగాణ ఖాళీ చేస్తుందని జగన్ ఆరోపించారు. నీళ్లు లేకుండా ఏపీ ఇబ్బందులు పడుతుంటే, శ్రీశైలం నుంచి రోజుకు 8 టీఎంసీల నీళ్లు ఖాళీ అవుతుంటే ప్రాజెక్ట్ ఎప్పుడు నిండుతుందని ఆయన ప్రశ్నించారు. “శ్రీశైలం నుంచి తెలంగాణ నీళ్లు తరలించుకుపోతోంది.. కిందున్న రాయలసీమ, నెల్లూరు పరిస్థితి ఏంటి? ఈ విషయంలో చంద్రబాబు ఏరోజైనా ఆలోచన చేశారా? ఈ పరిస్థితిని చక్కబెట్టడం కోసం వైసీపీ హయాంలో చర్యలు తీసుకున్నాం. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో.. రాయలసీమ రైతులకు చంద్రగ్రహణం పట్టింది’’ అని వైఎస్ జగన్ ఆరోపించారు.