విజయ సాయి చంద్రబాబుకు లొంగిపోయాడు: వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణ

విజయ సాయి చంద్రబాబుకు లొంగిపోయాడు: వైసీపీ అధినేత జగన్ సంచలన ఆరోపణ

హైదరాబాద్: ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితంగా మెలిగిన విజయసాయిరెడ్డిపై వైసీపీ అధినేత జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి విజయ సాయిరెడ్డి అని జగన్ సంచలన ఆరోపణ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా మూడున్నర సంవత్సరాల పదవీ కాలం ఇంకా మిగిలి ఉండగా.. చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకు విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడని జగన్ విమర్శించారు. ప్రలోభాలకు లొంగిపోయి తన సభ్యత్వాన్ని అమ్ముకున్నాడని, అలాంటి వ్యక్తి చేసిన ఆరోపణలకు విలువ ఏముంటుందని జగన్ ప్రశ్నించారు.

వైసీపీ పార్లమెంటరీ పార్టీ పదవికి, రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయి రెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన రాజీనామాను ఢిల్లీలో రాజ్య సభ చైర్మన్ జగదీప్ ధన్​ఖడ్ ఆమోదించారు. వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. జగన్తో మాట్లాడిన తర్వాతే రాజీనామా చేశానని చెప్పారు. తన రాజీనామాతో ఏపీలో అధికారంలో ఉన్న కూటమికే లబ్ధి చేకూరుతుందని అన్నారు.4 దశాబ్దాలుగా జగన్తో, ఆయన కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు.