
కేసీఆర్ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోతే వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటి వరకు కూడా పొలాలను పరిశీలించలేదు..రైతులను పరామర్శించలేదని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వాల ద్వారా వచ్చే సబ్సిడీలు అన్ని కలిపితే రైతులకు 30 వేల వరకు లాభం చేకూరేదని..కానీ ఇప్పుడు రైతు బంధుతో ఎకరానికి 5 వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. రైతులను పట్టించుకోని బీఆర్ఎస్ సర్కారు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఇందుకేనా తెలంగాణ సాధించుకుంది అని నిలదీశారు.
వికారాబాద్ జిల్లా మోమిన్ పేట్ మండలం చిన్న అమరాది కుర్దు గ్రామంలో భారీ వర్షాలతో దెబ్బతిన్న పంటలను వైఎస్ షర్మిల పరిశీలించారు. రైతులకు నష్టపరిహారం చెల్లించే వరకు వైఎస్సార్టీపీ పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు. ఊ అంటే రైతు సర్కారు అంటూ గొప్పలు చెప్పుకునే మంత్రులు పంటలు నష్టపోతే ఆదుకోరా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయి పుట్టెడు దుఖం:లో ఉన్న రైతులను ఆదుకుంటామని భరోసా ఇవ్వకపోతే మంత్రుల పర్యటన ఎందుకని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి..అన్నదాతలకు నష్టపరిహారం ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.