TSPSC: టీఎస్పీఎస్సీ కాకమ్మ కథలు చెబుతోంది: షర్మిల

TSPSC: టీఎస్పీఎస్సీ కాకమ్మ కథలు చెబుతోంది: షర్మిల

టీఎస్పీఎస్సీ(TSPSC) బోర్డుపై వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.  ప్రశ్నాపత్రాలనే అంగట్లో సరుకుల్లా అమ్ముకున్నోళ్లకు ఓఎంఆర్ షీట్స్ తారుమారుచేయడం పెద్ద విషయం కాదన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో టీఎస్పీఎస్సీ ఆటలాడుతుందనేది కోర్టులో ఇచ్చిన వివరణే ఒక నిదర్శనమన్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేస్తే కమిషన్ కి వచ్చిన నష్టం ఏంటని ప్రశ్నించారు.   తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను కాస్త.. దొరల ప్రగతి భవన్ సర్వీస్ కమీషన్ గా మార్చారని విమర్శించారు. నచ్చినోళ్లకు పదవులు, కావాల్సినోళ్లకు ఉద్యోగాలు ఇదే దొర తెచ్చిన బంగారు తెలంగాణ అంటూ మండిపడ్డారు.


ALSO READ: టికెట్ ఇస్తా అని..రూ. 10 కోట్లు, 5 ఎకరాలు తీసుకుండు.. రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణ

 ఇప్పటిదాకా ఏ సర్కారు పరీక్షలే పెట్టనట్లు.. ఎవరూ ఉద్యోగాలే ఇవ్వనట్లు కమిషన్ కాకమ్మ కథలు చెబుతుందన్నారు షర్మిల.  గ్రూప్ 1 పరీక్షలు ఎంత మంది రాశారో ముందొక లెక్క... ఓఎంఆర్ షీట్స్ లెక్కిస్తే మరో లెక్క రావడం కామన్ అని అనడం  విడ్డూరమన్నారు.  అర్హత లేనోళ్లకు, దొర అడుగులకు మడుగులు ఒత్తేటోళ్లకు పదవులు కట్టబెడితే కామన్ కాక మరేంటని ప్రశ్నించారు. నిజంగా బోర్డు పారదర్శకత పాటిస్తే పేపర్లు బయటకు ఎందుకు వచ్చాయన్నారు.

ఓసారి పరీక్ష రద్దైన తర్వాత మరోసారి ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదని ప్రశ్నించారు షర్మిల.   అన్యాయం జరిగిందని కోర్టు మెట్లు ఎక్కితే.. పెట్టిన పరీక్షలే న్యాయస్థానం రద్దు చేసిందంటే.. TSPSC పారదర్శకత ఏంటో  అర్థమైందన్నారు. రెండు సార్లు పరీక్షలు రాసినా ఫలితం లేదని.. 2.33 లక్షల నిరుద్యోగుల గోస ఈ సర్కారుకు తగులుతుందన్నారు.