టీఆర్ఎస్‌ని ఎలా ఎదుర్కొవాలి? 11 ప్రశ్నల ఫీడ్‌బ్యాక్ ఫామ్ ఇచ్చిన షర్మిల

టీఆర్ఎస్‌ని ఎలా ఎదుర్కొవాలి? 11 ప్రశ్నల ఫీడ్‌బ్యాక్ ఫామ్ ఇచ్చిన షర్మిల

హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలకు చెందిన నాయకులు, వైఎస్ అభిమానులతో షర్మిల భేటీ అయ్యారు. వారితో కలిసి లోటస్‌పాండ్‌లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చిందా? తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేయాల్సినవి చేస్తుందా? అని ఆమె ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. షర్మిల జై తెలంగాణ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన వారిని 11 ప్రశ్నలతో కూడిన ఫీడ్‌బ్యాక్ ఫామ్ నింపాలని కోరారు.

‘కుల, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా వైఎస్ఆర్ అందరినీ ప్రేమించారు. ప్రతి రైతు రాజు కావాలని కలలు కన్నాడు. ప్రతి విద్యార్థి గొప్ప చదువులు చదవాలనుకున్నాడు. ప్రతి పేదవానికి ఒక సొంత ఇల్లు ఉండాలనుకున్నాడు. అనారోగ్యం పాలైతే ఉచిత వైద్యం అందాలనుకున్నాడు. అందుకే తెలంగాణ ప్రజలు ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే తెలంగాణలో రాజన్న రాజ్యమే మన లక్ష్యం. వైఎస్ఆర్ పథకాలు మళ్లీ తీసుకురావాలంటే ఏంచేయాలో చెప్పండి. ప్రస్తుతం రాష్ట్రంలో రౌడీయిజం నడుస్తుంది. తెరాస దొరల పాలనలో కేసీఆర్ కుటుంబం తప్ప, ఎవరూ హ్యాపీగా లేరు. దళితులకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో తీరని అన్యాయం జరుగుతోంది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం నిర్మిస్తామన్నా హామీని తుంగలో తొక్కారు. దళితులకు జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించాలి. తెలంగాణలో ఫీజు రీయంబర్స్‌మెంట్ మాటే వినిపించడం లేదు. ఆ పథకం పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది.
ముస్లిం రిజర్వేషన్లపై వై.ఎస్ హయాంలో తీసుకొచ్చిన చట్టం అమలుకు నోచుకోవడం లేదు. పేదల వరప్రదాయిని ఆరోగ్య శ్రీ నిర్వీర్యం అయింది. ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ దొరికే జబ్బులను తొలగించారు. ఆపదలో అర క్షణం ఆలస్యం చేయని 108, 104 పూర్తిగా జాడ లేకుండా అయ్యాయి. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కారులకు టీఆర్ఎస్ అన్యాయం చేస్తోంది. గ్యాస్ ధరలను సెంట్రల్ గవర్నమెంట్ పెంచినా.. ఆ పెంచిన ధరలను స్టేట్ గవర్నమెంట్ భరిస్తుందని ఆనాడు వైఎస్సార్ అన్నారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మన పార్టీ పట్ల యువత ఆసక్తిగా ఉన్నారు. పార్టీలో యువతకు సముచిత స్థానం ఇవ్వాలి. పార్టీ ప్రారంభానికి ముందే ఇతర పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయ్. కొంతమంది ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారు. పార్టీలన్నీ ప్రజలను దోచుకోవాలనే చూస్తున్నాయి. ఆ సంప్రదాయం పోవాలంటే వైఎస్ షర్మిల రావాలి. కులమతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందాలంటే.. వైఎస్సార్ పాలన రావాలి. తెలంగాణలో నిరుద్యోగులకు మొండిచేయి చూపిన కేసీఆర్.. వారి కుటుంబంలో మాత్రం నాలుగు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. కమిషన్లు వచ్చే కాళేశ్వరం ప్రాజెక్టు తప్ప అన్ని ప్రాజెక్టులను కేసీఆర్ విస్మరించారు. తెరాస, కాంగ్రెస్, బీజేపీని నమ్మే పరిస్థితులు లేవు. బంగారు తెలంగాణ వారి కుటుంబంలో మాత్రమే ఉంది’ అని ఆమె అన్నారు.

11 ప్రశ్నల ఫీడ్ బ్యాక్ ఫామ్

1. పార్టీ ఏర్పాటు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు?

2. టీఆర్ఎస్‌ని ఎలా ఎదుర్కొవాలి?

3. బీజేపీని ఎలా ఎదుర్కొవాలి?

4. తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలేంటి?

5. ఈ కష్టాలను ఏ విధంగా పరిష్కరించాలి?

6. మీ అసెంబ్లీ పరిధిలో వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి పనులు ఏంటి?

7. తెలంగాణ ఉద్యమకారులు ఏమంటున్నారు?

8. బలమైన ప్రత్యామ్నాయంగా ఏర్పడాలంటే పోరాడాల్సిన అంశాలేంటి?

9. సంస్థాగతంగా బలపడేందుకు ఏంచేయాలి?

10. టీఆర్ఎస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలన్నీ నెరవేర్చిందా?

11. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేయాల్సినవి చేస్తుందా?

For More News..

ఫన్నీ వీడియో: జూమ్ కాల్ మీటింగ్‌లో ఉన్న భర్తను కిస్ చేయబోయిన భార్య

వ్యాక్సినేషన్ బార్.. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఫ్రీ

మార్స్‌పై సేఫ్‌గా దిగి ఫోటో పంపిన నాసా రోవర్