కేసీఆర్, కేటీఆర్​కు షర్మిల సవాల్ 

కేసీఆర్, కేటీఆర్​కు షర్మిల సవాల్ 
  • నాతో పాదయాత్రకు రండి..మీ పాలన ఎట్లుందో చూపిస్త
  • సమస్యలు లేవంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్త 
  • కేసీఆర్, కేటీఆర్​కు షర్మిల సవాల్ 

మెదక్​(చిలప్​చెడ్, కొల్చారం), వెలుగు: ప్రజలు సమస్యలతో సతమతమవుతుంటే, కేసీఆరేమో తమ పాలన అద్భుతమంటూ చెప్పుకుంటున్నారని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. ‘‘మీ పాలన అద్భతమని అంటున్నారు. నిజంగానే మీ పాలన అద్భుతమని మీకు నమ్మకం ఉంటే ఒక్క రోజు నాతో కలిసి పాదయాత్రకు రండి. ప్రజలకు ఎన్ని సమస్యలు ఉన్నాయో తెలుస్తుంది. నిజంగా ప్రజలకు సమస్యలు లేకుంటే నా ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పి ఇంటికి వెళ్లిపోతా. కానీ ప్రజలకు సమస్యలుంటే మాత్రం మీరు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవికి రాజీనామా చేయాలి. దళితుణ్ని సీఎంని చేయాలి” అని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​కు ఆమె సవాల్ విసిరారు. దమ్ముంటే కేసీఆర్ తన సవాల్​ను స్వీకరించాలన్నారు. శనివారం మెదక్ జిల్లా చిలప్​చెడ్, కొల్చారం మండలాల్లో పాదయాత్ర చేశారు. మంతాయిపల్లి తండాలో నాగలి దున్ని, గిరిజన రైతులతో మాట్లాడారు. పాదయాత్ర 2,400 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా కొల్చారం మండలం చిన్నఘనపూర్​లో వైఎస్​ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం సభలో షర్మిల మాట్లాడారు. 

ఒక్క హామీ కూడా నెరవేర్చలే...

కేసీఆర్ జాతీయ పార్టీ ఏర్పాటుపై షర్మిల విమర్శించారు. కూట్లె రాయి తీయనోడు.. ఏట్లె రాయి తీస్తానన్న చందంగా కేసీఆర్ తీరు ఉందని ఎద్దేవా చేశారు. ‘‘మన రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు చనిపోతుంటే ఆదుకోవడం తెలియదు గానీ, ఇతర రాష్ట్రాల వారిని ఆదుకుంటామనడం విడ్డూరంగా ఉంది. బంగారు తెలంగాణ చేస్తామన్నారు. కానీ  కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారమైంది” అని మండిపడ్డారు. టీఆర్ఎస్ 8 ఏండ్ల పాలనలో నిరుద్యోగులు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా కేసీఆర్ నిలబెట్టుకోలేదు. అరచేతిలో వైకుంఠం చూపించి ఓట్లు వేయించుకున్నారు. అధికారంలోకి వచ్చాక అన్నీ మరిచిపోయారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల పేరు చెప్పి లక్షల కోట్లు దోచుకున్నారు” అని ఫైర్ అయ్యారు.