ఏది ఏమైనా చామనపల్లికి యాత్ర కొనసాగించి తీరుతా : షర్మిల

ఏది ఏమైనా చామనపల్లికి యాత్ర కొనసాగించి తీరుతా : షర్మిల

పెద్దపల్లి జిల్లా : ధర్మారం మండలం చామనపల్లిలో తన ప్రజాప్రస్థానం యాత్రను అడ్డుకునేందుకు యత్నించిన మంత్రి కొప్పుల  అనుచరులపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.  ‘‘నా యాత్రను అడ్డుకోవడం కాదు.. దమ్ముంటే అభివృద్ధి చేసి చూపించండి’’ అని ఆమె సవాల్ విసిరారు. ‘‘ నా యాత్రపై దాడి చేయాలనుకున్న వాళ్లు ఇంకా బయటే ఎందుకున్నరు ? పోలీసులు వాళ్లను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?  ఎమ్మెల్యే, మంత్రి కోసమే పోలీసులు పనిచేస్తున్నరు అనేందుకు ఇదే నిదర్శనం’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.  ఎట్టి పరిస్థితుల్లో చామనపల్లికి యాత్ర కొనసాగించి తీరుతామని స్పష్టంచేశారు. అక్కడ ఎటువంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కొంటామని తేల్చిచెప్పారు.

షర్మిల గో బ్యాక్ అంటూ చామనపల్లిలో టీఆర్ఎస్ కార్యకర్తల రాస్తారోకో

‘‘ నిజంగానే పోలీసులకు అధికారం ఉంటే.. వైఎస్సార్టీపీ శ్రేణులకు, యాత్రకు రక్షణ కల్పించాలి. లేదంటే మాకు మేమే రక్షణ కల్పించుకుంటం. మంత్రి కొప్పుల దత్తత తీసుకున్న చామనపల్లి గ్రామం కొంచెం కూడా అభివృద్ధి కాలేదు’’ అని షర్మిల ఆగ్రహంగా కామెంట్ చేశారు. ‘‘సీఎం కేసీఆర్ దగ్గర స్థానిక ఎమ్మెల్యేకు, మంత్రికే విలువ లేదు.ఇక ప్రజలకేం విలువ ఉంటుంది’’ అని పేర్కొన్నారు. దళిత బంధు పథకం అనేది స్థానిక ఎమ్మెల్యే అనుచరులకు మాత్రమే అందిందని.. అది అనుచరుల బంధుగా మారిందని ఆమె ఆరోపించారు.