మా దీక్షకే ట్రాఫిక్ అడ్డమొచ్చిందా?. బీఆర్ఎస్ దీక్షలు, సభల సంగతేంటి: షర్మిల

మా దీక్షకే ట్రాఫిక్ అడ్డమొచ్చిందా?. బీఆర్ఎస్ దీక్షలు, సభల సంగతేంటి: షర్మిల
  • మా దీక్షకే ట్రాఫిక్ అడ్డమొచ్చిందా?
  • బీఆర్ఎస్ దీక్షలు, సభల సంగతేంటి: షర్మిల
  • కేసీఆర్.. వెన్నులో వణుకుపుడుతోందా? 
  • ‘టీ సేవ్’ దీక్షకు అనుమతివ్వకపోవడంపై ఫైర్ 
  • హైకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: పనికిమాలిన కారణాలను చూపుతూ తమ దీక్షకు అనుమతివ్వకుండా అడ్డుకుంటున్నారని సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్​లోని ఇందిరాపార్క్ వద్ద ‘టీ సేవ్’​ పేరిట దీక్ష చేపట్టేందుకు పోలీసులు అనుమతి నిరాకరించడంపై ఆమె ఆదివారం ఒక ప్రకటనలో స్పందించారు. ‘‘తెలంగాణకు పట్టిన నీచపాలన తుప్పును, తప్పులను కడిగేసేందుకు చేస్తున్న పోరాటాన్ని చూసి వెన్నులో వణుకు పుట్టిందా? కడుపులో మంట పుడుతోందా? కంటికి కునుకులేదా?’’ అని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. ఈ దీక్ష కేవలం తన పార్టీ చేస్తున్న ఉద్యమం కాదని, అన్ని పార్టీలు, సంస్థలు, సంఘాలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మేధావులు కలిసి చేస్తున్న ఉద్యమమని అన్నారు. దీక్షకు పర్మిషన్ కోసం హైకోర్టుకు వెళ్తామన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి రెండ్రోజులైనా కాకముందే.. ఆయన రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారని, ప్రజాస్వామ్యాన్ని గాలికొదిలేశారని విమర్శించారు.   

మీ దీక్షలకు ట్రాఫిక్ అడ్డం కాలేదా? 

ప్రశాంతంగా చేపట్టే నిరుద్యోగ నిరాహార దీక్షకు ట్రాఫిక్ అడ్డం వచ్చిందా? అంటూ షర్మిల ప్రశ్నించారు. బీఆర్ఎస్ ధర్నాలు, దీక్షలు, సభలు, సమావేశాలకు ట్రాఫిక్ అడ్డురాలేదా? అని అడిగారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అప్పటి ప్రభుత్వం ఇలాగే ఆలోచిస్తే కేసీఆర్ గతి ఏమై ఉండేదని ఫైర్ అయ్యారు. లిక్కర్ కేసులో ఇరుక్కున్న కేసీఆర్ బిడ్డను కాపాడేందుకు ఢిల్లీలో ఆయన చెంచాలు ఆడుతున్న నాటకాల సంగతేందో చెప్పాలన్నారు. ‘‘మా దీక్షలకు అనుమతి నిరాకరణ మీద ఉన్న సోయి.. నీ బిడ్డ వాట్సాప్ లీకుల మీద లేదా?’’ అంటూ కేసీఆర్​ను ప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ పోరాటం, దీక్ష ఆగవన్నారు.