ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై వైఎస్ షర్మిల ఫైర్

ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై వైఎస్ షర్మిల ఫైర్
  • తండ్రితోనే తిట్టించుకున్న చరిత్ర నీది
  • దళిత ఎమ్మెల్యే అన్యాయం చేస్తే ప్రశ్నించొద్దని   రాజ్యాంగంలో రాసుందా?
  • జోగిపేట సెంటర్​లో చర్చకు వస్తావా
  • ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై వైఎస్ షర్మిల ఫైర్

మెదక్​ (చేగుంట), వెలుగు: అవినీతి గురించి ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసులు పెడతారా? అని వైఎస్ఆర్​టీపీ చీఫ్​ వైఎస్​షర్మిల ప్రశ్నించారు. ప్రజాప్రస్థానంలో భాగంగా మంగళవారం మెదక్​ జిల్లా చిన్నశంకరంపేట, చేగుంట మండలాల్లో ఆమె పాదయాత్ర చేశారు. చేగుంటలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ‘ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ​అవినీతి గురించి నేను మాట్లాడినందుకు నాపై ఎఫ్​ఐఆర్ ​బుక్​ చేశారట. ఎమ్మెల్యే, ఆయన తమ్ముళ్లు కలిసి కబ్జాలు చేస్తున్నారని, వారు అవినీతి పరులని, కడుపున చెడ పుట్టావని ఆ ఎమ్మెల్యే తండ్రి స్వయంగా చెప్పిన మాటలు నేను ప్రస్తావించాను. తండ్రి తిట్టిన మాటలే నేను చెప్తే నా మీద కేసు పెడతారా? అలా అయితే ఆ తండ్రి మీద కూడా కేసులు పెట్టాలి కదా’ అని అన్నారు.  ‘దళిత ఎమ్మెల్యే అన్యాయం చేస్తే మాట్లాడకూడదు అని రాజ్యాంగంలో రాసి పెట్టి ఉందా? లేక అంబేద్కర్​ గారు చెప్పారా? దళితుడివై ఉండి దళితుల పక్షాన ఎప్పుడైనా పోరాటం చేశావా?’  అని ప్రశ్నించారు. ‘మీ అవినీతిపై ప్రశ్నించే దమ్ము నాకుంది. కాదని నిరూపించే దమ్ము నీకుందా? జర్నలిస్టులను పిలుద్దాం, ప్రతిపక్షాలను పిలుద్దాం, జోగిపేట నడిగడ్డ మీదే చర్చ పెడదాం’ అని సవాల్​ విసిరారు.  

రఘునందన్ రావుపై విమర్శలు
మల్లన్నసాగర్ బాధితులకు ఎమ్మెల్యే రఘునందన్ రావు ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు. ‘11 గ్రామాల ప్రజలకు అన్యాయం జరిగింది, నేను న్యాయం చేస్తా అని రఘునందన్ రావు చెప్పాడట, రెండింతలు పరిహారం ఇప్పిస్తాం అన్నాడట, అలా ఇప్పించక పోతే ఆర్నెళ్లలో రాజీనామా చేస్తా అన్నాడట.. కానీ ఇంతవరకు పరిహారం రాలేదు... ఆయన పదవికి రాజీనామా చేయలేదు’ అని న్నారు.  

ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలు పెట్టాలి 
తెలంగాణలో సమస్యలే లేవని సీఎంతో పాటు మంత్రి కేటీఆర్​ చెప్తున్నారు. ఉన్నాయని నేను నిరూపిస్తా, సమస్యలు లేకుంటే ముక్కు నేలకు రాసి ఇంటికి పోతా, సమస్యలుంటే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యే లు రాజీనామా చేయాలి, ప్రభుత్వాన్ని రద్దు చేసి, ప్రజలకు క్షమాపణలు చెప్పి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలి’ అని  అన్నారు.  

యాత్రకు మూడు రోజుల బ్రేక్
దసరా పండుగ నేపథ్యంలో ప్రజా ప్రస్తానం యాత్రకు వైఎస్ షర్మిల 3 రోజులు బ్రేక్ ఇచ్చారు. తిరిగి ఈనెల 8న తిరిగి కామారెడ్డి నుంచి పాదయాత్ర స్టార్ట్ చేస్తారని పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది.