ప్రభుత్వ పథకాలన్నీ మోసపూరితం..ఒక్క హామీ నెరవేర్చలె

ప్రభుత్వ పథకాలన్నీ మోసపూరితం..ఒక్క హామీ నెరవేర్చలె

సీఎం కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపించి అన్ని వర్గాలను వెన్నుపోటు పొడిచాడని వైఎస్ షర్మిల విమర్శించారు. ప్రభుత్వ పథకాలన్నీ మోసపూరితమని.. డబుల్ బెడ్రూం ఇళ్లు, మూడెకరాల భూమి, పోడు భూములకు పట్టాలు వంటి హామీలేమయ్యాయని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్య శ్రీ, పేద వాళ్ళకు ఇళ్ళు ఇచ్చింది రాజశేఖర్ రెడ్డి అని చెప్పారు. రెండు సార్లు కేసీఆర్ ను సీఎంని చేస్తే రాష్ట్రానికి ఆయన చేసిందేమిటని నిలదీశారు.

కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు ఎందుకు ఓట్లేయాలని షర్మిల ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓటుకు నోటు కేసులో దొంగ అని ఆరోపించారు. బీజేపీ మతం పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో మాట మీద మాట్లడే నాయకుడే లేడన్నారు. రాజశేఖర్ రెడ్డి ఆశయాలకోసం వైఎస్సార్ తెలంగాణ పార్టీ పెట్టినట్లు చెప్పారు. రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలన రావాలంటే తనను ఆశీర్వదించాలని కోరారు. 

ప్రాణహిత చేవెళ్ల ద్వారా పరిగి ప్రాంతానికి వైఎస్సార్ నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేశారని వైఎస్ షర్మిల తెలిపారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ చేసి ఈ ప్రాంతానికి  ఒక్క చుక్క నీరిచ్చాడా అని ప్రశ్నించారు. అద్భుతమన్న కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళల్లో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. తనపై గుడ్లు వేయమని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి తన మనుషులకు చెప్పాడన్న షర్మిల.. గుడ్లేసిన, రాళ్ళేసినా, బాంబులేసిన బెదిరేది లేదని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఒక్క ఎకరానికైనా నీళ్ళు తెచ్చిండా అని షర్మిల నిలదీశారు. ‘‘ రోడ్లు చూస్తే మీ ఎమ్మెల్యే పాలన అర్థమవుతుంది. ప్రభుత్వ పథకాలు వదులుకుంటే రోడ్లేపిస్తా అన్నాడు. నీ పదవి వదులుకో.. సోయితో మాట్లాడు. ఎమ్మెల్యే, ఆయన తమ్ముడు ఆలయ భూములు కబ్జా చేసి సంపాదించారు. గురుకులాల్లో కప్పల బువ్వ పెడితే ఎమ్మెల్యే పట్టించుకోలేదు. ఈ ఎమ్మెల్యేకు ప్రజలు కర్రు కాల్చివాత పెట్టాలి అని షర్మిల అన్నారు.