
- సీఎం కేసీఆర్‌పై షర్మిల ఫైర్.. హనుమకొండలో నిరుద్యోగ నిరాహార దీక్ష
- ఉద్యోగాలియ్యకుండా ఎంతమందిని పొట్టనపెట్టుకుంటరని నిలదీత
హనుమకొండ, వెలుగు: రాష్ట్రంలో ఉద్యోగాలను భర్తీ చేయకుండా ఇంకా ఎంత మంది నిరుద్యోగులను పొట్టనపెట్టుకుంటారని, ఇంకెంత మంది తల్లులకు కడుపుకోత మిగుల్చుతారని సీఎం కేసీఆర్‌పై వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, మండలాలన్నీ కలిపి 3.85 లక్షల ఉద్యోగ ఖాళీలున్నాయని, వాటన్నింటినీ భర్తీ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంటికో ఉద్యోగం ఇవ్వలేనప్పుడు కనీసం నిరుద్యోగ భృతైనా ఇవ్వాలని, లేదంటే సీఎం పదవికి రాజీనామా చేసి దళితుడిని ఆ సీట్లో కూర్చోబెట్టాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె హనుమకొండలోని బాలసముద్రం హయగ్రీవాచారి గ్రౌండ్లో నిరుద్యోగ నిరాహారదీక్ష చేశారు. అంతకుముందు కాకతీయ యూనివర్సిటీ నుంచి గ్రౌండ్ వరకు ఆమె పాదయాత్రగా తరలివచ్చారు. జాబ్ నోటిఫికేషన్లు రావట్లేదన్న బాధతో సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని, కానీ, ఇంతవరకూ ఆయన కుటుంబాన్ని మాత్రం కేసీఆర్ ఆదుకోలేదని షర్మిల విమర్శించారు. సునీల్ సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన కేసీఆర్.. ఇప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ప్రగతి భవన్‌లోని బాత్రూంలకూ సీఎం కేసీఆర్ బుల్లెట్ ప్రూఫ్ పెట్టుకున్నాడని, తన ప్రాణాలకు అంత విలువనిచ్చుకునే కేసీఆర్‌కు నిరుద్యోగుల ప్రాణాలంటే విలువలేదా అని నిలదీశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని నమ్మించి.. ఇప్పుడు విద్యార్థులను బలిపీఠమెక్కిస్తున్నాడని విమర్శించారు.
ఎన్నికలుంటేనే పథకాలు
ఎన్నికలుంటేనే సీఎం కేసీఆర్ పథకాలను తెస్తారని, అది ఆయన నైజమని షర్మిల మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో వరంగల్ రోడ్ల మీద పడవలు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితులున్నాయన్నారు. వరంగల్‌ను డల్లాస్, వాషింగ్టన్ చేస్తానన్న కేసీఆర్.. వరదల్లో మునిగేలా చేశాడన్నారు. టెక్స్టైల్ పార్క్ కోసం తట్టెడు మట్టినీ ఎత్తిపోయలేదన్నారు. సీఎం ప్రయత్నించకపోవడం వల్లే కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ రాలేదన్నారు. ప్రపంచానికి ఎందరో మేధావులను అందించిన కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు.. ఖాళీ యూనివర్సిటీ అయిందన్నారు. రుణమాఫీ చేయకపోవడం వల్ల రైతులపై మిత్తి భారం పడుతోందన్నారు. రైతుబంధు కింద రూ.5 వేలిచ్చి.. ఇన్సూరెన్స్, పెట్టుబడి, సబ్సిడీల కింద రూ.15 వేలు కొట్టేస్తున్నాడని ఆమె మండిపడ్డారు.