దళిత సీఎం నుంచి దళితబంధు వరకు అంతా మోసమే: షర్మిల

దళిత సీఎం నుంచి దళితబంధు వరకు అంతా మోసమే: షర్మిల

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని దళితులందరినీ కేసీఆర్​ మోసం చేస్తున్నారని, వారిని కేవలం ఓటు బ్యాంకులా ఉపయోగించుకుంటున్నారని వైఎస్ ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మంగళవారం ట్యాంక్ బండ్ మీద ఆయన విగ్రహానికి షర్మిల పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని, కేసీఆర్ రాజ్యాంగం అమలవుతున్నదన్నారు. కేసీఆర్ లో ‘కే’ అంటే (కొట్టి).. ‘సీ’ అంటే (చంపే).. ‘ఆర్’ అంటే (రాజ్యాంగం) అని ఆమె ఎద్దేవా చేశారు. అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్నామని నేతలు ప్రతి స్టేజీపై అంటున్నారని, మాటల్లో తప్ప ఆచరణలో ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. దళిత సీఎం నుంచి దళిత బంధు దాకా అన్నిచోట్ల ఎస్సీలకు అన్యాయం జరుగుతున్నదన్నారు. వైఎస్​ఆర్.. ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెడితే, కేసీఆర్ దాన్ని రీడిజైన్ పేరుతో కాళేశ్వరంగా మార్చారన్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని చేయలేదన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయడానికి రాజ్యాంగం అడ్డు వచ్చిందా? అని షర్మిల ప్రశ్నించారు. అందుకే రాజ్యాంగం మార్చాలని మాట్లాడుతున్నారన్నారు. ప్రజల కోసం పోరాడేవాళ్లపై దాడులు చేయడం, పెట్రోల్ తో వెహికల్స్​ను ధ్వంసం చేయడం, పోలీసులను పార్టీ కార్యకర్తల్లా ఉపయోగించుకోవటం కేసీఆర్ రాజ్యాంగంలోని అంశాలన్నారు. 

హరీశ్​రావుది గోబెల్స్​ ప్రచారం

‘వైఎస్ఆర్ తెలంగాణ ఇవ్వడం చుట్టాబీడి ఇచ్చినంత తేలిక కాదు’ అని అనలేదని, మంత్రి హరీశ్​రావు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని షర్మిల మండిపడ్డారు. ఉద్యమ సమయంలో పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె మర్చిపోయినట్టు నాటకమాడిన వ్యక్తి హరీశ్​రావు అని గుర్తు చేశారు. శ్రీకాంతా చారి ఆత్మబలిదానం చేసుకొని అమరవీరుడైతే, హరీశ్​రావు అగ్గిపెట్టే మర్చిపోయి మంత్రయ్యారని సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నదన్నారు. ఉద్యమంలో ఒకరు గడ్డాలు పెంచుకొని దీక్షలు చేసినట్లు నాటకం ఆడారని, ఇంకొకామె అమాయకంగా బతుకమ్మ ఆడుతూనే లిక్కర్ మాఫియా నడిపిందని, ఇంకొకరు ఉద్యోగాల కోసం వందల మంది నిరుద్యోగులు చనిపోతుంటే అనుకున్నదాని కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చామని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.