కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలి

కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ చేయించాలి

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకత వకలపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని సవర్నర్ తమిళ పైకి వైఎస్ఆర్ తెలంగాణ. పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఫిర్యాదు చేశారు. సోమవారం ఆమె రాజ్ భవన్ లో గవర్నరు కలిశారు.అరగంట పాటు వీరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన మోసం. ఆ ప్రాజెక్టుతో ఇప్పటివరకూ ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదు. లక్ష కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టుతో ప్రయోజనం ఏముంది? ఎప్పుడో కట్టిన దేవాదుల చెక్కు చెదరకుండా ఉంటే,  నాసిరకం పనులతో ఇటీవల కట్టిన కాళేశ్వరం మునిగిపోయింది. కాంక్రీటుతో చేయాల్సిన నిర్మాణాలకు బ్రిక్స్‌‌, మట్టి వినియోగించారు” అని ఆరోపించారు.

కృష్ణారెడ్డి తప్ప.. మొనగాళ్లెవరూ లేరా?

మేఘా కృష్ణారెడ్డి, కేసీఆర్ కుటుంబం కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని షర్మిల విమర్శించారు. రూ.79 వేల కోట్ల అవినీతి జరిగిందని జీఎస్టీ ఆఫీసర్ చెబుతున్నా, చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలోని 90 శాతం ప్రాజెక్టులను మేఘా కంపెనీకే కట్టబెట్టడం వెనుక మతలబు ఏందో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులు నిర్మించేందుకు కృష్ణారెడ్డి తప్ప.. మొనగాళ్లెవరూ లేరా అని ప్రశ్నించారు. లక్ష కోట్లతో కట్టిన ప్రాజెక్టు నీళ్లలో మునిగితే, కట్టిన కంపెనీది తప్పే లేదన్నట్టుగా అధికారులు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ పనుల్లో ఐదుగురు కూలీలు చనిపోతే, కంపెనీపై కనీస చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. మేఘా కృష్ణారెడ్డి అవినీతిపై కాంగ్రెస్‌‌, బీజేపీ మౌనపాత్ర వహిస్తున్నాయని ఆరోపించారు. రేవంత్‌‌రెడ్డి, బండి సంజయ్‌‌ అమ్ముడుపోలేదని గ్యారంటీ లేదన్నారు. రేవంత్‌‌రెడ్డి పిలక కేసీఆర్ చేతిలో ఉందని విమర్శించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీ కాదా? ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎక్కడున్నారు? ఆ పార్టీ ఎమ్మెల్యేలది రాజకీయ వ్యభిచారం” అని తీవ్ర వ్యాఖ్యలు చేశారువరద బాధితులకు ఇస్తామన్న రూ.పది వేల సాయాన్ని కూడా కేసీఆర్ ఇవ్వలేకపోయాడని విమర్శించారు. 

కొడంగల్ లో షర్మిల పాదయాత్ర

వైఎస్సార్ పీ చీఫ్ షర్మిల పాదయాత్ర మంగళవారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలో ఆమె పర్యటించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎంకేపల్లి స్టేజ్ వద్ద ప్రజలతో మాట్లాడతారు. ఆ తర్వాత కొడంగల్ టౌన్ లోని అంబేద్కర్ స్టాచ్యూ సెంటర్ వద్ద జరిగే బహిరంగ సభలో షర్మిల ప్రసంగిస్తారని పార్టీ వర్గాలు సోమవారం ప్రకటించాయి