ధీమా పక్కన పెట్టి..బీమా ఇస్తాడట.. ఓట్ల కోసం తప్ప.. మేనిఫెస్టో ప్రజల కోసం కాదు

ధీమా పక్కన పెట్టి..బీమా ఇస్తాడట.. ఓట్ల కోసం తప్ప.. మేనిఫెస్టో ప్రజల కోసం కాదు

బీఆర్ఎస్ మేనిఫెస్టోపై  వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. కొండంత రాగం తీసి పిల్లికూత కూసినట్లుంది కేసీఆర్ ఎన్నికల మ్యానిఫెస్టో అని ఎద్దేవా చేశారు.  పోయిన ఎన్నికలకు ఇచ్చిన హామీలే నెరవేర్చే దిక్కు లేదు... మళ్లీ కొత్త కథ మొదలు పెట్టిండని ట్విట్టర్లో  మండిపడ్డారు. 

కేసీఆర్ బిమా పథకంపై స్పందిస్తూ.. బ్రతుకు మీద ఇవ్వాల్సిన ధీమా పక్కన పెట్టి పోయాక భీమా ఇస్తాడట అంటూ వైఎస్ షర్మిల చురకలంటించారు. సున్నా వడ్డీకే రుణాలు అని మోసం చేసిన దొర  ప్రతి మహిళకు నెలకు 3 వేలు ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.  నిరుద్యోగ భృతి అని గత మ్యానిఫెస్టోలో పెట్టిన పథకానికే దిక్కులేదు కానీ ఇప్పుడు 3 వేలు ఇస్తామంటే నమ్మాలా? అని ప్రశ్నించారు. 

 విడతల వారీగా పెన్షన్ల పెంపు అనేది ఒక పెద్ద జోక్ అని వైఎస్ షర్మిల కొట్టిపారేశారు.  రుణమాఫీ పై దొర గారి యూ టర్న్ అంటూ సెటైర్లు వేశారు.  ఉద్యోగాలు ఇవ్వలేక ఏనాడో చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. ఉన్న పథకాలను పాతర పెట్టి ఓట్ల కోసం కొత్త పథకాలు అంటూ డ్రామాలు తప్ప మరోటి లేదని విమర్శించారు.  బందిపోట్ల సమితి మ్యానిఫెస్టో ఓట్ల కోసం తప్ప ప్రజల కోసం కాదన్నారు.